అదరగొట్టిన భారత్‌.. ఆసీస్‌కు భారీ లక్ష్యం | India set Target of 353 Runs Against Australia | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన భారత్‌.. ఆసీస్‌కు భారీ లక్ష్యం

Published Sun, Jun 9 2019 6:59 PM | Last Updated on Sun, Jun 9 2019 7:46 PM

India set Target of 353 Runs Against Australia - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 353  పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.  శిఖర్‌ ధావన్‌(117; 109 బంతుల్లో 16 ఫోర్లు), రోహిత్‌ శర్మ(57; 70 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(82; 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది. మ్యాచ్‌ ఆరంభం మొదలుకొని చివరి వరకూ భారత్‌ బ్యాటింగ్‌లో సత్తాచాటింది.
(ఇక్కడ చదవండి: ధావన్‌-రోహిత్‌ల జోడి అరుదైన ఘనత)

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు.  తొలి ఏడు ఓవర్ల వరకూ ఈ జోడి అత్యంత నెమ్మదిగా ఆడింది. దాంతో భారత జట్టు ఏడు ఓవర్లు ముగిసే సరికి 22 పరుగులు మాత్రమే చేసింది. అటు తర్వాత ధావన్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. కౌల్టర్‌ నైల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఓవర్లు ధావన్‌ 14 పరుగులు పిండుకోవడంతో భారత్‌ గాడిలో పడింది. ఆపై నిలకడగా బ్యాటింగ్‌ చేయడంతో పాటు అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరొకవైపు రోహిత్‌ కూడా సమయోచితంగా ఆడి అర్థ సెంచరీ సాధించాడు. ఈ జోడి 127 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రోహిత్‌(57) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.


(ఇక్కడ చదవండి: ఆసీస్‌ను వెనక్కు నెట్టిన టీమిండియా..)

ఆ తరుణంలో కోహ్లితో కలిసిన ధావన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ప్రధానంగా ఆసీస్‌ బౌలింగ్‌ విభాగానికి పరీక్షగా నిలిచి సెంచరీ నమోదు చేశాడు. ఇది ధావన్‌కు 16వ వన్డే సెంచరీ. అయితే భారత్‌ స్కోరు 220 పరుగుల వద్ద ధావన్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో కోహ్లితో కలిసిన హార్దిక్‌ పాండ్యా తనదైన మార్కు ఆట తీరుతో చెలరేగాడు. అయితే హాఫ్‌ సెంచరీకి రెండు పరుగుల దూరంలో హార్దిక్‌ పాండ్యా మూడో వికెట్‌గా ఔట్‌ కాగా, ఆ తర్వాత వచ్చిన ధోని 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 27 పరుగులు సాధించి నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆఖరి ఓవర్‌లో స్కోరును పెంచే క్రమంలో కోహ్లి కూడా ఔట్‌ కాగా, కేఎల్‌ రాహుల్‌ 3 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ కొట్టడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో స్టోయినిస్‌ రెండు వికెట్లు సాధించగా, కమిన్స్‌, స్టార్క్‌, కౌల్టర్‌ నైల్‌లకు తలో వికెట్‌ లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement