హైదరాబాద్: తాజాగా ముగిసిన ఐపీఎల్‌లో రెండు విషయాలు ఎక్కువ చర్చనీయాంశమయ్యాయి. ఒకటి మన్కడింగ్ కాగా మరొకటి వికెట్ల నుంచి బెయిల్స్ పడకపోవడం. జోఫ్రా ఆర్చర్, ధావల్ కులకర్ణి వంటి బౌలర్ల బౌలింగ్‌లో బంతి వికెట్లను తాకినా బెయిల్స్ పడకపోవడంతో బ్యాట్స్‌మెన్ బతికిపోయారు. దీంతో వికెట్లు, బెయిల్స్‌పై అనుమానాలు కలిగాయి. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌కు అలానే లైఫ్ వచ్చింది. ధోనీ అయితే బెయిల్స్ తీసి మరీ అవెందుకు కిందపడలేదో చూశాడు.
ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా బుమ్రా రెండో ఓవర్ వేసేందుకు వచ్చాడు. తొలి బంతి ఎదుర్కొన్న డేవిడ్‌వార్నర్ డిఫెన్స్ ఆడబోయి ఆ బంతి వికెట్లకు కాస్త బలంగానే తగిలింది. అయితే వికెట్లపై నుంచి బెయిల్స్ పడకపోవడంతో వార్నర్ బతికిపోయాడు. అప్పటికీ అతడు ఒక్క పరుగే చేశాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్, టీమిండియా సారథులు దీనిపై విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇలాంటివి కచ్చితంగా ఊహించలేమని, ఇలా జరగాల్సింది కాదని పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ వేసిన బంతి వికెట్లను తాకి బెయిల్స్ పడకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
కారణమేంటి?
సాధారణ బెయిల్స్ కంటే జింగ్ బెయిల్స్ మూడింతల బరువు ఉండటం వల్లే అవి కింద పడటం లేదని విమర్శలు వస్తున్నాయి. వికెట్ల నుంచి బెయిల్స్ విడిపోగానే.. సెకన్‌లో 1000వ వంతు టైంలోనే వాటిలో ఉన్న లైట్లు వెలుగుతాయి. రనౌట్ల సమయంలో జింగ్ బెయిల్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. కానీ ఎల్‌ఈడీ, వైరింగ్, బ్యాటరీ కారణంగా జింగిల్ బెయిల్స్ బరువు పెరిగిపోయింది. ఈ కారణంగానే అవి కింద పడటం లేదని భావిస్తున్నారు. మీడియం పేసర్లు విసిరిన బంతికి బెయిల్స్ కిందపడటం లేదంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఫాస్ట్ బౌలర్లకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవడం పట్ల క్రీడా పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment