ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన సందర్భంగా భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగింది. భారత్ జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమే.
అదీ భారత్ జట్టు వరసగా పరాజయం పాలవడం, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు పేలవమైన ఫామ్‌తో విఫలం కావడం, చివరి మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది.
అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలు బయటికి పొక్కడానికి.. ఒక యువ క్రికెటర్ కారణమని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. స్వయంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసాడని కూడా వార్తలు వచ్చాయి.
కానీ.. నిజంగా గంభీర్ ఈ విషయాన్నీ బీసీసీఐకి తెలియజేసాడా అంటే.. దీని గురించి బీసీసీఐ అధికారులు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. మరి భారత డ్రెస్సింగ్ రూమ్ నుండి ఇలాంటి లీకులకు భాద్యులు ఎవరు? ఈ విషయాన్నీ బీసీసీఐ స్పష్టం చేయాలి.
గంభీర్ పేలవమైన రికార్డు
గౌతమ్ గంభీర్‌ను భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించిన తర్వాత నుంచి భారత్ జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తోంది. గత జూలైలో శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు రావడానికి ముందు గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించారు.
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 3-0 విజయంతో గంభీర్ కోచ్‌గా తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఆ తరువాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 0-2తో భారత్ జట్టు ఓటమి చవిచూసింది.
ఆ తరువాత బంగ్లాదేశ్‌పై 2-0 టెస్ట్ సిరీస్ విజయంతో జట్టు కొద్దిగా పుంజుకున్నట్టు కనిపించినా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3 తో కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో 3-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్‌కు ముందు గంభీర్ సీనియర్ ఆటగాళ్లను మందలించాడని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. ఈ లీకులు భారత్ జట్టు నుంచి మాత్రమే కాక భారత్ బోర్డు నుంచి కూడా వస్తున్నాయని చోప్రా ఎత్తి చూపడమే కాక ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు.
అతడి కెరీర్ నాశనం చేస్తారా? లీకులకు బాధ్యులు ఎవరు?
తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో, ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. లీకుల ఆధారంగా వచ్చే కథనాలు ఒక ఆటగాడి కెరీర్‌కు హాని కలిగిస్తాయని పేర్కొన్నాడు. యువ ఆటగాడి భవిష్యత్తును ప్రమాదంలో పడేసే లీక్ అయిన వాదనలను వ్యాప్తి చేయకుండా ఉండాలని అతను బీసీసీఐని, క్రికెట్ అభిమానుల్ని కోరాడు.
"ఇలాంటి లీకులు ఒక యువ ఆటగాడి క్రికెట్ కెరీర్ ను ప్రమాదంలో పడేశాయి. ఈ లీకులు వాస్తవమే అని మరో లీకు ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఆ అతగాడి కెరీర్ కు ఎంత ప్రమాదమో ఆలోచించారా" అని ప్రశ్నించాడు.
బుమ్రా మంచి పనిచేశాడు
అదే వీడియోలో జస్ప్రీత్ బుమ్రా కు సంబంధించిన మరో సంఘటనని చోప్రా ఉదహరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ చివర్లో, మళ్ళీ రెండవ ఇన్నింగ్స్‌లో బుమ్రా వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు.
అయితే బుమ్రా తనకు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సరికాదని బుమ్రా స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఖండించాడని చోప్రా ఎత్తి చూపాడు. బుమ్రా ఈ ట్వీట్ చేయని పక్షంలో దాన్ని నిజమని నమ్మేవారు. ఇలాంటి వార్తలను జట్టుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలి అని చోప్రా సూచించాడు.
బీసీసీఐ జాగ్రత్త పడాలి
అయితే భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా సీతాన్షు కోటక్ నియమించబోతున్నారని కూడా వార్త బీసీసీఐ అధికారిక ప్రకటనకు ముందే మీడియా లో రావడాన్ని ఇక్కడ ఉదహరించాడు. మీడియాకు ఈ వార్త తెలియకముందే బీసీసీఐ ముందస్తుగా వ్యవహరించి వారి నియామకాలను ముందుగానే ప్రకటించాలని చోప్రా సూచించాడు.
"భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సీతాన్షు కోటక్ నియమిస్తున్నారనేది పెద్ద వార్త. ఈ విషయాన్నీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించవచ్చు కదా. మీరు ముందస్తుగా చెప్పడం ప్రారంభిస్తే.. లీకులకు స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది’’ అని చోప్రా సూచించాడు. మరి బోర్డు అధికారులు ఈ విషయాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి.
చదవండి: ఫామ్‌లో ఉన్నా కరుణ్ నాయర్‌ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే
Comments
Please login to add a commentAdd a comment