కొలంబో:ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ జట్టు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శిఖర్ ధావన్(90; 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు తోడు మనీష్ పాండే(37), రిషబ్ పంత్(23)లు ఫర్వాలేదనిపించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరును సాధించకల్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ డకౌట్‌గా అవుట్ కావడంతో పాటు సురేశ్ రైనా(1) కూడా నిరాశపరిచాడు.
ఈ తరుణంలో శిఖర్ ధావన్‌కు జత కలిసిన మనీష్ పాండే ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఒకవైపు ధావన్ విరుచుకుపడితే, మనీష్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ కలిసి 95 పరుగులు జోడించిన తర్వాత మనీష్ పెవిలియన్‌కు చేరాడు. దాంతో 104 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను నష్టాపోయింది. ఆపై రిషబ్ పంత్-ధావన్‌ల జోడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఈ జోడి 49 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో చమీరా రెండు వికెట్లు సాధించగా, నువాన్ ప‍్రదీప్, జీవన్ మెండిస్, గుణతిలకాలు తలో వికెట్ సాధించారు.
చెలరేగిన ధావన్
భారత్ జట్టు తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో శిఖర్ ధావన్ మాత్రం ఆత్మవిశ్వాసంతో చెలరేగి ఆడాడు. శ్రీలంక బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంటూ బౌండరీల వర్షం కురిపించాడు. ప్రధానంగా ధావన్ సిక్సర్లతో విరుచుకుపడిన తీరు అభిమానుల్లో జోష్‌ను నింపింది. ఎక్కువ శాతం వికెట్ కీపర్ వెనుక నుంచి సిక్సర్ల కొడుతూ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముందుగా 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన శిఖర్.. సెంచరీకి దగ్గరగా వచ్చి పెవిలియన్ చేరాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన ధావన్.. టీ 20ల్లో శ్రీలంకపై అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment