సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ధోనీ
మొహాలీ: న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుల మోత మోగించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 50కి పైగా సగటుతో 9 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్గా అరుదైన రికార్డు నెలకొల్పిన ధోనీ.. సచిన్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా ధోనీ (196) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేగాక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సంధించిన కెప్టెన్గా మరో ఘనత సాధించాడు.
న్యూజిలాండ్తో మ్యాచ్లో 286 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ను కోహ్లీ, ధోనీ ఆదుకున్నారు. ఓపెనర్లు రోహిత్ (13), రహానె (5) తక్కువ పరుగులకే అవుట్ కాగా.. ధోనీ, విరాట్ హాఫ్ సెంచరీలు చేశారు. ధోనీ మూడు సిక్సర్లు బాదడంతో సచిన్ (195) రికార్డు బ్రేక్ అయ్యింది. భారత్ 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కివీస్ 49.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది.