ఐపీఎల్-9 వివాదంలో మిస్టరీ
ఐపీఎల్-9వ సీజన్నూ వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ నుంచి ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేను ఉన్నఫళంగా తొలగించడానికి కారణమేంటన్నది మిస్టరీగా మారింది. దీనికి కొందరు టీమిండియా సీనియర్ క్రికెటర్లే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. భోగ్లేకు వ్యతిరేకంగా వారు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
భోగ్లే కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తనను ఎందుకు తొలగించారో కారణం తెలియదని భోగ్లే చెబుతున్నాడు. బీసీసీఐ కూడా కారణం వెల్లడించలేదు. ఐపీఎల్ టోర్నీకి రెండ్రోజుల ముందు వరకు ఆయన కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా ఒకే అయ్యాయి. ఇంతలోనే తన సేవలు అవసరం లేదని ఈ మెయిల్ పంపినట్టు భోగ్లే వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. టి-20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా సీనియర్ క్రికెటర్లు భోగ్లేపై బోర్డుకు ఫిర్యాదు చేసి ఉంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ ధోనీతో పాటు సురేష్ రైనా, అశ్విన్ మీడియా సమావేశాల్లో దురుసుగా మాట్లాడటాన్ని నెటిజన్లు ప్రస్తావించారు. భోగ్లే ఇటీవల విదర్భ క్రికెట్ సంఘం గురించి పరుష వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. భోగ్లే పేరును ప్రస్తావించకుండా ఇటీవల విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో భోగ్లే ఉద్వాసనకు కారణమేంటన్నది మిస్టరీగా మారింది.