కెప్టెన్ హోదాలో తిరిగొచ్చాను : కోహ్లీ
అంటిగ్వా: వెస్టిండీస్ పర్యటన అంటే తనకెంతో ప్రత్యేకమని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు. సరిగ్గా ఐదేళ్ల కిందట 2011లో విండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్తోనే తాను టెస్ట్ కెరీర్ ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. గురువారం విండీస్తో భారత్ తొలి టెస్ట్ ఆడనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. 'టెస్ట్ క్రికెట్ ఓనమాలు ఇక్కడే నేర్చుకున్నాను. ఆటలో మార్పులు, పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా ఆడాలి లాంటి ఎన్నో విషయాలపై అవగాహన వచ్చింది' అని విరాట్ చెప్పుకొచ్చాడు.
అప్పట్లో సాధారణ ఆటగాడిగా కరీబియన్ పర్యటనకు వచ్చిన తాను ప్రస్తుతం కెప్టెన్ హోదాలో ఇక్కడికి వచ్చానని హర్షం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్ లలో పాటించిన ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని ఇక్కడ అమలు చేయనున్నాడు. దాంతో టాప్ ఆర్డర్ లో లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్లలో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. తుదిజట్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలో అర్థం కావడం లేదన్నాడు. టీమిండియా అంచనాలు ఎక్కువగా స్పిన్ విభాగంపైనే ఆధారపడి ఉన్నాయన్నాడు.