వెస్టిండీస్ పర్యటన కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో నయా వాల్ పుజారా పేరు గల్లంతు కావడంపై అతని అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వారితో కొందరు టీమిండియా మాజీలు, విశ్లేషకులు గొంతు కలుపుతున్నారు. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై మాత్రం ఎందుకోనని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఒకేలా చెత్త ప్రదర్శనలు చేసినప్పడు కోహ్లిపై సెలెక్టర్లకు ప్రత్యేక ప్రేమ ఎందుకోనని నిలదీస్తున్నారు.
ఈ విషయాన్ని గణాంకాల ఆధారంగా రుజువు చేస్తూ సెలెక్టర్ల తీరుపై ధ్వజమెత్తుతున్నారు. 2020 నుంచి పుజారా 28 టెస్ట్‌లు ఆడి 29.69 సగటున పరుగులు చేస్తే, కోహ్లి సైతం అదే యావరేజ్‌తో (25 మ్యాచ్‌ల్లో) పరుగులు చేశాడని, ఇద్దరూ ఒకేలా వెలగబెట్టినప్పుడు కోహ్లిపై మాత్రమే ప్రత్యేకమైన ఇంటరెస్ట్ చూపడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు.
పుజారాతో పాటు కోహ్లిని కూడా తప్పిస్తే అతనికీ తెలుసొచ్చేది, అలాగే మిడిలార్డర్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినట్లూ ఉండేదని అంటున్నారు. పుజారా, కోహ్లిలను పక్కకు పెడితే 2020 నుంచి టెస్ట్‌ల్లో గిల్ (16 మ్యాచ్‌ల్లో 32.89 సగటు), రహానే (20 మ్యాచ్‌ల్లో 26.50)లు కూడా అడపాదడపా ప్రదర్శనలే చేశారని, వీరితో పోలిస్తే రోహిత్ శర్మ (18 మ్యాచ్‌ల్లో 43.2) ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడని గణాంకాలతో సహా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.
అందరూ ఓపెనర్లే.. మిడిలార్డర్‌లో ఎవరు..?
వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టుపై పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వన్ డౌన్ ఆటగాడు పుజారాను పక్కకు పెట్టారు సరే.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎక్కడ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్ జట్టుకు కొత్తగా ఎంపికైన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఓపెనర్ బ్యాటర్లేనని, అలాంటప్పుడు పుజారా స్థానాన్ని ఎలా భర్తీ చేయగలరని నిలదీస్తున్నారు. జట్టులో ఆల్‌రెడీ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఓపెనర్లుగా ఉన్నప్పుడు కొత్తగా మిడిలార్డర్ బ్యాటర్‌ను తీసుకుని ఉంటే జట్టు సమతూకంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
సర్ఫరాజ్ ఖాన్‌ను ఎందుకు తీసుకోలేదు..?
ఓ మిడిలార్డర్ బ్యాటర్‌పై (పుజారా) వేటు వేసినప్పుడు అతని స్థానాన్ని మరో మిడిలార్డర్ ఆటగాడితోనే భర్తీ చేయాలన్న లాజిక్‌ను సెలెక్టర్లు ఎలా మిస్ అయ్యారని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. జట్టులో అందరూ ఓపెనర్లనే ఎంపిక చేయకపోతే, దేశవాలీ క్రికెట్‌లో అద్భుతాలు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాడిని తీసుకొని ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
Comments
Please login to add a commentAdd a comment