![BGT 2023: Pujara Set To Join Elite List Of Indians With 100 Tests - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/14/Untitled-5_0.jpg.webp?itok=xtUFUXm9)
టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా అరుదైన క్లబ్‌లో చేరేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ పుజారా కెరీర్‌లో వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. భారత్ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఘనత కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే దక్కింది.
ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో పక్కాగా తుది జట్టులో ఉండే పుజారా ఈ అరుదైన క్లబ్‌లో చేరే 13వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న భారత ఆటగాళ్లలో కేవలం విరాట్ కోహ్లి మాత్రమే 100 టెస్ట్‌ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. కోహ్లి తన కెరీర్‌లో ఇప్పటివరకు 105 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు.
టెస్ట్‌లతో పాటు 5 వన్డేలు ఆడిన పుజారా 10.2 సగటున 51 పరుగులు మాత్రమే చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అంత ఆశాజనకంగా సాగని పుజారా కెరీర్.. ఐపీఎల్ లాంటి పావులర్ లీగ్‌ల్లోనూ అంతంతమాత్రంగానే సాగింది. క్యాష్ రిచ్ లీగ్‌లో పుజారా ఇప్పటివరకు కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌లో 99.74 స్ట్రయిక్ రేట్ కలిగిన పుజారా.. హాఫ్ సెంచరీ సాయంతో 390 పరుగులు చేశాడు.
ఇటీవలకాలంలో టెస్ట్ క్రికెటర్ అన్న ముద్ర తొలగించుకనే ప్రయత్నం చేస్తున్న నయా వాల్.. తాజాగా జరిగిన ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కౌంటీ సీజన్‌లో అదరగొట్టాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్‌లో గేర్ మార్చిన పుజారా.. తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
2010లో ఆస్ట్రేలియాపైనే టెస్ట్ అరంగేట్రం చేసిన పుజారా అదే ఆస్ట్రేలియాపై తన వందో టెస్ట్ కూడా ఆడటం యాదృచ్చికంగా జరుగనుంది. ఆసీస్‌పై ఘనమైన రికార్డు కలిగిన పుజారా తన వందో టెస్ట్‌లో శతకం బాదాలని ఆశిద్దాం. పుజారా ఆసీస్‌పై 21 మ్యాచ్‌ల్లో 52.77 సగటున 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1900 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment