నా గోడు వినండి: మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ: ఐసీఎల్(ఇండియన్ క్రికెట్ లీగ్) నుంచి బయటికి వచ్చిన క్రికెటర్లు అందరికీ క్షమాభిక్ష అందించిన బీసీసీఐ,మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియాను మాత్రం పట్టించుకోవడం లేదు. బీసీసీఐతో ఎంతమాత్రం సంబంధం లేని ఆ క్రికెట్ లీగ్ వ్యవహారంలో మోంగియాపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలు కారణంగా అతన్ని పక్కకు పెట్టేశారు. ఇక్కడ మోంగియాపై బీసీసీఐ ఎటువంటి నిషేధం విధించకపోయినప్పటికీ అతన్ని మాత్రం పూర్తిగా పట్టించుకోవడమే మానేసింది.
ప్రస్తుతం 40వ ఒడిలో ఉన్న మోంగియాకు తన క్రికెట్ పునరాగమనంపై ఎటువంటి ఆశలు లేవు. కాగా, తన గోడు వినాలంటూ బీసీసీఐకి మరోసారి మొరపెట్టుకున్నాడు. ప్రధానంగా తనకు చెల్లించాల్సిన ఉన్న బకాయిల విషయంలో బీసీసీఐకి ఇప్పటికే చాలాసార్లు విన్నవించానని, అందుకు వారి నుంచి ఎటువంచి సమాధానం రావడం లేదన్నాడు. తాజాగా మరోసారి తన గోడు వినే అవకాశాన్ని బీసీసీఐ కల్పించాలంటూ మోంగియా ఆవేదన వ్యక్తం చేశాడు. 'నాపై నిషేధం లేదు. కానీ బీసీసీఐ నా బకాయిల విషయంలో స్పందించడం లేదు. ఇది చాలా కొత్తగా ఉంది. చాలాసార్లు బీసీసీఐకి, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కి నా వాదన వినాలని లేఖ రాశా. అయినా వారు ముందుకు రావడం లేదు. ఐసీఎల్ లో నేను తప్పుచేశాను అనడానికి సాక్ష్యాలు లేవు. కనీసం నా వాదనను వినే అవకాశం ఇవ్వండి. ఇటీవల మొహ్మద్ అజహరుద్దీన్ కేసును విన్నట్లే, నా వాదన కూడా వినండి. బీసీసీఐ క్షమాబిక్ష కోసం ఎదురుచూస్తున్నా'అని మోంగియా విన్నవించాడు.
ఐసీఎల్ ఫిక్సింగ్ వివాదంపై 2015లో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ .. మోంగియా పేరును బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఫిక్సింగ్‌లో కీలక పాత్ర పోషించిన నలుగురు సభ్యుల బృందానికి దినేశ్ మోంగియా నాయకత్వం వహించాడని అతను వెల్లడించాడు. కాగా, అతను తప్పుచేసినట్లు ఆధారాలు లభించలేదు.మరొకవైపు బీసీసీఐ కూడా మోంగియా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన జట్టులో సభ్యుడైన దినేశ్ మోంగియా భారత్ తరఫున 57 వన్డేలు, 1 టి20 మ్యాచ్ ఆడాడు.