
దీప కొత్త చరిత్ర
జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ
ఆర్టిస్టిక్ విభాగంలో కాంస్యం
గ్లాస్గో: జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్‌లో భారత క్రీడాకారిణి దీప కర్మాకర్ కొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్ విభాగంలో ఆమె కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డులకెక్కింది. గురువారం జరిగిన ఫైనల్లో తొలి వాల్ట్‌లో 13,633 పాయింట్లు సాధించిన దీప... రెండో వాల్ట్‌లో అందరికంటే ఎక్కువగా 15,100 పాయింట్లు నమోదు చేసింది. అయితే ఓవరాల్ పాయింట్లలో (14,366) వెనుకబడి మూడో స్థానంతో సంతృప్తిపడింది.
ఫ్రాగపనీ (ఇంగ్లండ్-14,633), బ్లాక్ (కెనడా-14,433) వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకున్నారు. పురుషుల ఫ్లోర్ ఫైనల్లో ఆశిష్ కుమార్ నిరాశపర్చాడు. 13,800 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ విభాగంలో వైట్‌లాక్ (ఇంగ్లండ్-15,533), మెర్గాన్ (కెనడా-15,133), బిషప్ (న్యూజిలాండ్-14,550) వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యం సాధించారు.