'టర్నింగ్ పాయింట్ అదే'
ముంబై: విరాట్ కోహ్లి, డివిలియర్స్ తొందరగా అవుట్ కావడంతో మ్యాచ్ తమ చేతుల్లోంచి జారిపోయిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా అన్నాడు. వీరిద్దరూ మరింతసేపు క్రీజులో ఉంటే తాము గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో ఇక్బాల్ 4 నాలుగు ఓవర్లలో 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
'కోహ్లి, డివిలయర్స్ లను అవుట్ అవడం టర్నింగ్ పాయింట్. టీమ్ లోని టాప్ బ్యాట్స్ మెన్స్ తొందరగా అవుట్ అయితే పరుగులు ఎక్కువగా రావు. ఈ ప్రభావం మొత్తం జట్టుపై ఉంటుంద'ని మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. తనకు జట్టులో చోటు దక్కుతుందా, లేదా అనేది కెప్టెన్ పై ఆధారపడి ఉంటుందని 26 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అన్నాడు. మరో ఎనిమిది తొమ్మిదేళ్లు క్రికెట్ ఆడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు.