అసలు పోరులో ధోని సేన నిలిచేనా?
పెర్త్:ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలుత జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో ఘనవిజయాలు సాధించిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా అసలు సిసలైన పోరుకు సన్నద్ధమవుతుంది. అటు వార్మప్ ట్వంటీలో విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ లు దాటిగా ఆడటంతో పశ్చిమ ఆస్ట్రేలియా జట్టును ధోని సేన తొలుత కంగుతినిపించగా, ఆ తరువాత జరిగిన వార్మప్ వన్డేలో బౌలర్లు రాణించడంతో టీమిండియా రెండో విజయాన్ని సాధించింది. ఈ రెండు విజయాలు పేస్ కు స్వర్గధామమైన పెర్త్ లోని 'వాకా' స్టేడియంలో జరగ్గా, మరి మంగళవారం జరిగే తొలి వన్డే కూడా ఇదే స్టేడియం వేదిక కానుంది. రేపు ఉదయం గం.8.50 ని.లకు(భారత కాలమాన ప్రకారం) ఇరు జట్ల మధ్య మొదటి వన్డే ఆరంభం కానుంది. ప్రాక్టీస్ లో వచ్చిన ఉత్సాహాన్ని, అక్కడ ఆడిన అనుభవాన్ని ధోని సేన ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
భారత్, ఆసీస్ మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ద్వైపాక్షిక వన్డే సిరీస్ జరగలేదు. గతంలో వన్డే ప్రపంచకప్‌లు, ముక్కోణపు లేదా నాలుగు దేశాల టోర్నీలలో పాల్గొన్న రెండు జట్లు ఈసారి ముఖాముఖి పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఇటీవల స్వదేశంలో జరిగిన రెండు టెస్టు సిరీస్ ల్లో ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించి మంచి జోష్ మీద ఉండగా, ఇటు టీమిండియా కూడా టెస్టుల్లో పటిష్టమైన దక్షిణాఫ్రికాను మట్టికరిపించి అంతే ఉత్సాహంతో ఉంది.
ఇదిలా ఉండగా ఆటగాళ్ల విషయానికొస్తే విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని,శిఖర్ ధవన్ లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-10 లో ఉండగా, ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్ వెల్ ఒక్కడే ర్యాంకింగ్స్ లో 10వ స్థానంలో ఉన్నాడు. టీమిండియా ప్రధానంగా కొంతమంది ఆటగాళ్లపై ఆధారపడుతుండగా... ఆస్ట్రేలియాది ఎప్పుడూ సమష్టి పోరాటమే. అప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూ విజయాలు సాధించడం ఆసీస్ కు బాగా తెలిసిన విద్య. మరోవైపు టీమిండియా జట్టులో ఆల్ రౌండర్ల లోటు స్పష్టంగా కనబడుతోంది. ఇది ప్రధానంగా జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో పాటు మహేంద్ర సింగ్ ధోని ఏ స్థానంలో ఆడతాడనేది ఇంకా స్పష్టత లేదు. ఈ సిరీస్ లో సురేష్ రైనా లేకపోవడంతో ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. గతంలో ఎక్కువగా ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ధోని.. ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగితేనే టీమిండియా బ్యాటింగ్ కాస్తలో కాస్త మెరుగ్గా ఉంటుంది.
ముగ్గురు పేసర్లు.. ఇద్దరు స్పిన్నర్లు
తొలి వన్డేలో తాము అనుసరించబోయే బౌలింగ్ వ్యూహం ఏమిటో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వెల్లడించాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఒకవేళ ఇదే జరిగితే ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలతో పాటు కొత్త పేసర్ బరీందర్ శరణ్ కూడా తుది జట్టులో ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉండాలంటే మాత్రం రిషి ధావన్ ను జట్టులోకి తీసుకుంటారు. ఇక స్పిన్నర్లలో రవి చంద్రన్ అశ్విన్ తుది జట్టులో ఉండటం ఖాయం కాగా, రెండో స్పిన్నర్ గా రవీంద్ర జడేజా వైపే ధోని మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రాక్టీస్ అదరగొట్టిన ధోని అండ్ గ్యాంగ్.. అసలు పోరులో నిలుస్తుందా?లేదా?అనేది చూడాల్సిందే.
వాతావారణం
తొలి వన్డేకు వర్షం పడే అవకాశం లేదు. వాతావరణం పొడిగా ఉండనుంది. కనీస ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది.