mahedra singh dhoni
-
ఏడేళ్ల క్రితం ధోని సేన సగర్వంగా!
-
యువీ-ధోనిల సరికొత్త రికార్డు
కటక్: ఇంగ్లండ్ తో ఇక్కడ బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోని జంట సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్-ధోనిలు చెలరేగి ఆడి నాల్గో వికెట్‌కు ఇంగ్లండ్ పై అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్ లో 173 పరుగుల అజేయ భాగస్వామ్య మార్కును చేరడం ద్వారా ఆ జట్టుపై నాల్గో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతకుముందు 2012లో దక్షిణాఫ్రికా జోడి హషీమ్ ఆమ్లా-ఏబీ డివిలియర్స్‌లు ఇంగ్లండ్ పై నాల్గో వికెట్ కు నమోదు చేసిన 172 పరుగుల అజేయ భాగస్వామ్యమే ఇప్పటికే వరకూ అత్యధికం. దాన్ని నాలుగేళ్ల తరువాత యువీ-ధోనిలు సవరించి కొత్త రికార్డు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన విరాట్ సేన తడబడింది. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో యువీ-ధోనిల జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. తొలుత యువరాజ్ సింగ్ 56 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేయగా, ఆ తరువాత కాసేపటికి ధోని 68 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు. ఆపై యువరాజ్ అదే ఫామ్ ను కొనసాగించి సెంచరీ మార్కును చేరాడు. యువరాజ్ సింగ్ 98 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం సాధించాడు. ఇది యువరాజ్ కెరీర్లో 14 వన్డే సెంచరీ. -
బాహుబలి.. బిర్యానీ.. ధోనీ@హైదరాబాద్!
'ఐ లవ్ హైదరాబాద్.. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మొదట హైదరాబాద్ బిర్యానీయే గుర్తొస్తుంది' అని మిస్టర్ కూల్, టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తెలిపాడు. తన జీవిత కథ ఆధారంగా వస్తున్న 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ 'హైదరాబాద్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నప్పుడు తొలిసారి ఇక్కడి బిర్యానీని రుచిచూశాను. ఆ తర్వాత ఎప్పుడు ఇక్కడికీ వచ్చినా బిర్యానీ మిస్ అయ్యేవాణ్ని కాదు. బిర్యానీతోపాటు హైదరాబాద్‌లో బేకరి బిస్కట్లు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడి గాజులకు మంచి పేరుంది' అని చెప్పాడు. ‘టీమిండియాకు హైదరాబాద్‌లో ఎప్పుడు మ్యాచ్‌లు ఆడినా ఇక్కడి వారి నుంచి మంచి మద్దతు లభించేది. హైదరాబాద్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉంది' అని ధోనీ వివరించాడు. దక్షిణాది సినిమాల విషయానికి వస్తే గతంలో ఓ సినిమా చూశానని, తాజాగా గత ఏడాది 'బాహుబలి' సినిమా చూశానని ధోనీ చెప్పాడు. 'బాహుబలి' సీక్వెల్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. దక్షిణాదిలో మంచి నటులు ఉన్నారని, ఇక్కడి సినిమాలు బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతున్నాయని గుర్తుచేశాడు. జీవితంలోపైకి రావాలంటే నిజాయితీ, ఆచరణాత్మక ఆలోచన విధానం ముఖ్యమని యువతకు ధోనీ సూచించాడు. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని, అనుకున్న లక్ష్యాన్నిచేరేందుకు అనువైన ప్రణాళికతో హార్డ్‌వర్క్‌తో ముందుకువెళ్లాలని చెప్పాడు. పెద్దలను గౌరవించడం, అందరినీ సమానంగా చూడటం, వినమ్రంగా ఉండటం విజయానికి కీలకమని తెలిపాడు. ఈ కార్యక్రమంలో 'బాహుబలి' దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఇప్పటికీ అదే ధ్యాస: ధోని
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విడదీయరాని బంధం ఏదైనా ఉందంటే చెన్నై సూపర్ కింగ్స్‌తోనే అనేది కాదనలేని సత్యం. ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి గతేడాది వరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని సారథిగా వ్యవరించాడు. ఆ జట్టుతో ధోనికి ఎనిమిదేళ్ల సుదీర్ఘ బంధం ఉంది. అయితే ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై, రాజస్థాన్ జట్లపై రెండేళ్లు వేటు పడింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న అనుబంధాన్ని ప్రస్తుతం పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోని మరోసారి గుర్తు చేసుకున్నాడు. 'ఇప్పటికీ అదే ధ్యాస. చెన్నై సూపర్ కింగ్స్ జర్సీ లేకుండా ఫీల్డింగ్‌లోకి రావడం ఏదో వెలితిగా ఉంది. నా టీ 20 క్రికెట్ ఆరంభమైన దగ్గర్నుంచీ భారత జట్టుతో పాటు జార్ఖండ్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాను. ఇందులో చెన్నైతో ఎనిమిదేళ్ల సుదీర్ఘ బంధం ఉంది. ఈసారి పసుపు కలర్ జర్సీతో కనిపించకపోవడం నిజంగానే బాధగా ఉంది. కనీసం ఆ జట్టుతో ఉన్న జ్ఞాపకాలు ఒక అంగుళం కూడా నా నుంచి పోలేదు' అని ధోని పేర్కొన్నాడు. -
సచిన్-కోహ్లిల మధ్య పోలిక ఎందుకు?
కోల్‌కతా: మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లిని పోల్చడం ఎంతమాత్రం సరికాదని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేర్కొన్నాడు. అసలు సచిన్‌తో విరాట్‌ను పోల్చాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించాడు. 'సచిన్ ఒక లెజండ్ ఆటగాడు. విరాట్ ఇంకా ఆరంభంలోనే ఉన్నాడు. అటువంటప్పుడు వారి మధ్య పోలిక అనవసరం' అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ టీ 20లో భారత్‌ను ఫైనల్ కు చేర్చడంలో విఫలమైన మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగొతేనే మంచిదని భావిస్తున్నారా?అన్న ప్రశ్నకు కపిల్ దేవ్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. కెప్టెన్ ను మార్చాలన్నది సెలక్టర్ల నిర్ణయమన్నాడు. ఒకవేళ వారు మార్చాలనుకుంటూ మార్పు ఉంటుందన్నాడు. అయితే ధోని అనేకసార్లు విజయవంతమైన కెప్టెన్ గా నిరూపించుకున్న సంగతిని మరువకూడదని కపిల్ ఈ సందర్భంగా తెలిపాడు. -
ధోని సరికొత్త రికార్డు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్, ఫాల్కనర్లను స్టంపింగ్ రూపంలో పెవిలియన్ కు పంపిన ధోని.. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అత్యధిక స్టంపింగ్స్(140) చేసిన వికెట్ కీపర్ గా గుర్తింపు సాధించాడు. తద్వారా అంతకుముందు శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగాక్కర అంతర్జాతీయ కెరీర్ లో నెలకొల్పిన 139 స్టంపింగ్స్ రికార్డు చెరిగిపోయింది. తొలుత యువరాజ్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ క్రీజ్ ను వదిలి కొద్దిగా ముందుకు వెళ్లి బంతిని హిట్ చేయబోయి ధోనికి దొరికిపోగా, ఆ తరువాత ఫాల్కనర్ ను తన ప్యాడ్లతో బంతిని వికెట్లపైకి తోసి ధోని సక్సెస్ అయ్యాడు. ధోని చేసిన ఆ రెండు స్టంపింగ్స్ తో నే మ్యాచ్ ఆసీస్ చేతుల్లోంచి పూర్తిగా చేజారిపోయింది. రెండో ట్వంటీ 20లో ఆసీస్ పై టీమిండియా 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0 తేడాతో దక్కించుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్(60;47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ధావన్(42;32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్(59 నాటౌట్;33 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్) దాటిగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరులో సహకరించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 20.0ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులకే చాపచుట్టేసి ఓటమి చెందింది. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్(74;48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా , బూమ్రాలకు చెరో రెండు వికెట్లు దక్కగా, అశ్విన్, పాండ్యా, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది. -
ధోనిసేనకు పేస్ పరీక్ష...
-
ప్రయోగాల వేళ...
భారత్, ఆస్ట్రేలియాల మధ్య చివరిసారి వన్డే మ్యాచ్ జరిగినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడా ఉంది. వేదిక అదే అయినా పిచ్‌లు వేరు, జట్లు వేరు, టోర్నీ ప్రతిష్ట వేరు. ఫ్లాట్ పిచ్‌లపై ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆడిన ఈ రెండు జట్లు ఈ ఏడాదిలో చాలా మారాయి. అటు ఆస్ట్రేలియా జట్టులోనూ సీనియర్ క్రికెటర్లు వైదొలిగారు. దీంతో కంగారూలు కూడా కొన్ని కొత్త ముఖాలతో బరిలోకి దిగుతున్నారు. ఇటు భారత్ పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు. ఈసారి సిరీస్‌లో కచ్చితంగా కొత్త ఆటగాళ్లను పరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టి20 ప్రపంచకప్‌తో పాటు వచ్చే నాలుగేళ్ల భవిష్యత్ కోసం కూడా రెండు జట్లు ప్రయోగాలు చేయడానికి ఈ సిరీస్ వేదిక కానుంది. * భారత్, ఆస్ట్రేలియాల తొలి వన్డే నేడు * ఇరు జట్లలోనూ కొత్త ముఖాలు ధోనిసేనకు పేస్ పరీక్ష పెర్త్: టి20 ప్రపంచకప్ వరకు ధోనియే కెప్టెన్ అంటూ ప్రకటించడం ద్వారా భారత సెలక్టర్లు ఓ మంచి పని చేశారు. జార్ఖండ్ డైనమైట్ కెరీర్ గురించి జరుగుతున్న చర్చకు తాత్కాలికంగా ఫుల్స్టాప్ పెట్టారు. అదే సమయంలో మహీకి మరో పెద్ద బాధ్యతను కట్టబెట్టి ఆస్ట్రేలియాకు పంపించారు. కొత్త బ్యాట్స్‌మెన్, కొత్త ఆల్‌రౌండర్లు, కొత్త బౌలర్లను ఇచ్చి టి20 ప్రపంచకప్ సమయానికి సరైన జట్టును తయారు చేయాలనే సవాల్‌నూ కెప్టెన్ ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో నేడు (మంగళవారం) ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. అటు కంగారూలు కూడా ఇద్దరు కొత్త బౌలర్లు పారిస్, బోలాండ్‌లను ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయిస్తున్నారు. పేస్, బౌన్స్ ఉండే వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూఏసీఏ-వాకా) పిచ్‌పై ఆస్ట్రేలియాను నిలువరించాలంటే భారత్ అన్ని విభాగాల్లోనూ నిలకడను చూపించాలి. బరిందర్ అరంగేట్రం... రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో విజయాలతో భారత్ ఆత్మవిశ్వాసంతో సిరీస్‌ను ప్రారంభించబోతోంది. కీలకమైన నలుగురు బ్యాట్స్‌మెన్ కోహ్లి, ధావన్, రోహిత్, రహానే ఒక్కో మ్యాచ్‌లో బాగా ఆడారు. ఈ నలుగురిలో కనీసం ఇద్దరు కుదురుకుంటేనే భారత్‌కు భారీ స్కోరు వస్తుంది. ఈ నలుగురితో పాటు ధోనితో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఆరో బ్యాట్స్‌మన్‌గా ఎవరిని ఆడించాలనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మనీష్ పాండే బాగా ఆడినా... గుర్కీరత్ ఏడాది కాలంగా దేశవాళీ మ్యాచ్‌లతో పాటు భారత్ ‘ఎ’ తరఫున నిలకడగా ఆడుతున్నాడు. గతంలో ఐదుగురు బౌలర్లు ఉన్నా... పార్ట్‌టైమ్ బౌలర్‌గా రైనా పనికొచ్చేవాడు. ఇప్పుడు రైనా లేనందున బౌలింగ్ కూడా చేయగల గుర్‌కీరత్‌కు తుది జట్టులో స్థానం లభించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో షమీ గాయం కారణంగా వెనుదిరగడం భారత్‌కు పెద్ద దెబ్బ. ఉమేశ్ యాదవ్‌తో కొత్త బౌలర్ బరిందర్ శరణ్ బరిలోకి దిగడం ఖాయమే. ఎడమచేతి వాటం బౌలర్ కావడం, బంతుల్లో వేగం ఉండటం వల్ల బరిందర్ను అరంగేట్రం చేయించే అవకాశం ఉంది. ఇద్దరు స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా తుది జట్టులో ఉంటారు. అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కావచ్చు. జట్టులో మూడో పేసర్‌గా ఇషాంత్ శర్మ బరిలోకి దిగుతాడు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆడకపోయినా... ఆల్‌రౌండర్ కంటే బౌలర్ జట్టులో ఉండాలని ధోని కోరుకుంటున్నందున ఇషాంత్ తుది జట్టులోకి రావడం ఖాయమే. బౌలింగ్‌లో అనుభవలేమి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది. ఓపెనర్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా... ఫించ్ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సమర్థుడు. ఇక స్మిత్, బెయిలీ ఇద్దరూ నిలకడగా ఆడతారు. మ్యాక్స్‌వెల్ మెరుపు విన్యాసాలు ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకు ఇప్పటికే సుపరిచితం. మిషెల్ మార్ష్, ఫాల్క్నర్ల రూపంలో ఇద్దరు నాణ్యమైన ఆల్‌రౌండర్లు తుదిజట్టులో ఉన్నారు. వికెట్ కీపర్ వేడ్ కూడా వేగంగా ఆడటంలో సిద్ధహస్తుడు. అయితే బౌలింగ్ విభాగమే కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం కంగారూలకు ప్రతికూలాంశం. హాజిల్‌వుడ్‌కు కూడా పెద్దగా అనుభవం లేదు. కొత్త పేసర్లు పారిస్, బోలాండ్‌లను అరంగేట్రం చేయిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎడమచేతి వాటం పేసర్ పారిస్‌కు ‘వాకా’ సొంత మైదానం. ఇక్కడి పరిస్థితులపై అతనికి పూర్తిగా అవగాహన ఉంది. మొత్తం మీద బౌలింగ్ లైనప్ అనుభవలేమితో కనిపిస్తోంది. ఈ కొత్త బౌలర్ల సత్తా ఏంటనేది తొలి వన్డేలో ఆసక్తికర అంశం. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, గుర్కీరత్, జడేజా, అశ్విన్, ఉమేశ్, బరిందర్, రిషి ధావన్/ఇషాంత్ శర్మ. ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, బెయిలీ, మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్, వేడ్, ఫాల్క్‌నర్, హాజిల్‌వుడ్, పారిస్, బోలాండ్. ఉ. గం. 8.50 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం 1 ఆస్ట్రేలియాలో భారత్ ఆడుతున్న తొలి ద్వైపాక్షిక సిరీస్ ఇది. గతంలో చాలా వన్డేలు ఆడినా అవన్నీ ముక్కోణపు టోర్నీలో భాగం. 10 ఆస్ట్రేలియాలో భారత్ వారిపై గెలిచిన వన్డేలు. 31 వన్డేల్లో కంగారూల చేతిలో ఓడింది. 1 గత ఏడు సంవత్సరాలలో భారత్ జట్టు ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో ఆడిన ఆరు వన్డేల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది. 169 కోహ్లి మరో 169 పరుగులు చేస్తే 7 వేల పరుగుల మైలురాయిని చేరతాడు. ఈ సిరీస్‌లో ఇది పూర్తయితే వేగంగా 7 వేలు చేసిన క్రికెటర్‌గా కూడా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం డివిలియర్స్ (166 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. కోహ్లి ఇప్పటివరకూ కెరీర్లో 158 ఇన్నింగ్స్‌లో 6831 పరుగులు చేశాడు. 14 ఆస్ట్రేలియా సొంతగడ్డపై గత 14 వన్డేల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ‘ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడతాం. ఈ పర్యటనలో ప్రతి అవకాశం ఓ సవాల్. అలాగే యువ క్రికెటర్లకు ప్రతి సవాల్ ఓ అవకాశం. ప్రతి యువ క్రికెటర్‌కూ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎంత నైపుణ్యం ఉన్నా అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడిని అధిగమించడమే కీలకం. ఆసీస్ దేశవాళీ క్రికెట్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. జాతీయ జట్టులోకి ఇద్దరు కొత్త బౌలర్లు వచ్చారంటే కచ్చితంగా వారిలో నైపుణ్యం ఉందనే అర్థం.’ - ధోని, భారత కెప్టెన్ ‘భారత్ బ్యాటింగ్ లైనప్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. కోహ్లి, రహానే, రోహిత్‌లాంటి నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడం ఏ ఫార్మాట్లో అయినా కీలకమే. పేస్ బౌలర్ ఎవరైనా పెర్త్ వికెట్‌పై బౌలింగ్ చేయడం అదృష్టం. ఇద్దరు కొత్త పేసర్లను ఈ పిచ్ మీద అరంగేట్రం చేయించడం వాళ్ల వాళ్ల కెరీర్‌కు మంచి ఆరంభం లభిస్తుంది.’ - స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్ పిచ్ పేస్, బౌన్స్ ఉంటుంది. ముఖ్యంగా తొలి గంట ఆటలో పేసర్లు బాగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. వాతావరణం వర్షం ముప్పేమీ లేదు. గరిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. -
అసలు పోరులో ధోని సేన నిలిచేనా?
పెర్త్:ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలుత జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో ఘనవిజయాలు సాధించిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా అసలు సిసలైన పోరుకు సన్నద్ధమవుతుంది. అటు వార్మప్ ట్వంటీలో విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ లు దాటిగా ఆడటంతో పశ్చిమ ఆస్ట్రేలియా జట్టును ధోని సేన తొలుత కంగుతినిపించగా, ఆ తరువాత జరిగిన వార్మప్ వన్డేలో బౌలర్లు రాణించడంతో టీమిండియా రెండో విజయాన్ని సాధించింది. ఈ రెండు విజయాలు పేస్ కు స్వర్గధామమైన పెర్త్ లోని 'వాకా' స్టేడియంలో జరగ్గా, మరి మంగళవారం జరిగే తొలి వన్డే కూడా ఇదే స్టేడియం వేదిక కానుంది. రేపు ఉదయం గం.8.50 ని.లకు(భారత కాలమాన ప్రకారం) ఇరు జట్ల మధ్య మొదటి వన్డే ఆరంభం కానుంది. ప్రాక్టీస్ లో వచ్చిన ఉత్సాహాన్ని, అక్కడ ఆడిన అనుభవాన్ని ధోని సేన ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్, ఆసీస్ మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ద్వైపాక్షిక వన్డే సిరీస్ జరగలేదు. గతంలో వన్డే ప్రపంచకప్‌లు, ముక్కోణపు లేదా నాలుగు దేశాల టోర్నీలలో పాల్గొన్న రెండు జట్లు ఈసారి ముఖాముఖి పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఇటీవల స్వదేశంలో జరిగిన రెండు టెస్టు సిరీస్ ల్లో ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించి మంచి జోష్ మీద ఉండగా, ఇటు టీమిండియా కూడా టెస్టుల్లో పటిష్టమైన దక్షిణాఫ్రికాను మట్టికరిపించి అంతే ఉత్సాహంతో ఉంది. ఇదిలా ఉండగా ఆటగాళ్ల విషయానికొస్తే విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని,శిఖర్ ధవన్ లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-10 లో ఉండగా, ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్ వెల్ ఒక్కడే ర్యాంకింగ్స్ లో 10వ స్థానంలో ఉన్నాడు. టీమిండియా ప్రధానంగా కొంతమంది ఆటగాళ్లపై ఆధారపడుతుండగా... ఆస్ట్రేలియాది ఎప్పుడూ సమష్టి పోరాటమే. అప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూ విజయాలు సాధించడం ఆసీస్ కు బాగా తెలిసిన విద్య. మరోవైపు టీమిండియా జట్టులో ఆల్ రౌండర్ల లోటు స్పష్టంగా కనబడుతోంది. ఇది ప్రధానంగా జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో పాటు మహేంద్ర సింగ్ ధోని ఏ స్థానంలో ఆడతాడనేది ఇంకా స్పష్టత లేదు. ఈ సిరీస్ లో సురేష్ రైనా లేకపోవడంతో ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. గతంలో ఎక్కువగా ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ధోని.. ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగితేనే టీమిండియా బ్యాటింగ్ కాస్తలో కాస్త మెరుగ్గా ఉంటుంది. ముగ్గురు పేసర్లు.. ఇద్దరు స్పిన్నర్లు తొలి వన్డేలో తాము అనుసరించబోయే బౌలింగ్ వ్యూహం ఏమిటో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వెల్లడించాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఒకవేళ ఇదే జరిగితే ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలతో పాటు కొత్త పేసర్ బరీందర్ శరణ్ కూడా తుది జట్టులో ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉండాలంటే మాత్రం రిషి ధావన్ ను జట్టులోకి తీసుకుంటారు. ఇక స్పిన్నర్లలో రవి చంద్రన్ అశ్విన్ తుది జట్టులో ఉండటం ఖాయం కాగా, రెండో స్పిన్నర్ గా రవీంద్ర జడేజా వైపే ధోని మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రాక్టీస్ అదరగొట్టిన ధోని అండ్ గ్యాంగ్.. అసలు పోరులో నిలుస్తుందా?లేదా?అనేది చూడాల్సిందే. వాతావారణం తొలి వన్డేకు వర్షం పడే అవకాశం లేదు. వాతావరణం పొడిగా ఉండనుంది. కనీస ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది.