
బాహుబలి.. బిర్యానీ.. ధోనీ@హైదరాబాద్!
'ఐ లవ్ హైదరాబాద్.. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మొదట హైదరాబాద్ బిర్యానీయే గుర్తొస్తుంది' అని మిస్టర్ కూల్, టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తెలిపాడు. తన జీవిత కథ ఆధారంగా వస్తున్న 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ 'హైదరాబాద్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నప్పుడు తొలిసారి ఇక్కడి బిర్యానీని రుచిచూశాను. ఆ తర్వాత ఎప్పుడు ఇక్కడికీ వచ్చినా బిర్యానీ మిస్ అయ్యేవాణ్ని కాదు. బిర్యానీతోపాటు హైదరాబాద్‌లో బేకరి బిస్కట్లు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడి గాజులకు మంచి పేరుంది' అని చెప్పాడు.
‘టీమిండియాకు హైదరాబాద్‌లో ఎప్పుడు మ్యాచ్‌లు ఆడినా ఇక్కడి వారి నుంచి మంచి మద్దతు లభించేది. హైదరాబాద్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉంది' అని ధోనీ వివరించాడు. దక్షిణాది సినిమాల విషయానికి వస్తే గతంలో ఓ సినిమా చూశానని, తాజాగా గత ఏడాది 'బాహుబలి' సినిమా చూశానని ధోనీ చెప్పాడు. 'బాహుబలి' సీక్వెల్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. దక్షిణాదిలో మంచి నటులు ఉన్నారని, ఇక్కడి సినిమాలు బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతున్నాయని గుర్తుచేశాడు.
జీవితంలోపైకి రావాలంటే నిజాయితీ, ఆచరణాత్మక ఆలోచన విధానం ముఖ్యమని యువతకు ధోనీ సూచించాడు. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని, అనుకున్న లక్ష్యాన్నిచేరేందుకు అనువైన ప్రణాళికతో హార్డ్‌వర్క్‌తో ముందుకువెళ్లాలని చెప్పాడు. పెద్దలను గౌరవించడం, అందరినీ సమానంగా చూడటం, వినమ్రంగా ఉండటం విజయానికి కీలకమని తెలిపాడు. ఈ కార్యక్రమంలో 'బాహుబలి' దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళితోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.