దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ యానిమేషన్ సిరీస్‌ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈ
ఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'బాహుబలిని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను మరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలిని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్ మాకు లభించింది. యానిమేషన్ సిరీస్‌పై వాళ్లు పంచుకున్న ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం పిల్లలనే కాదు.. అందరినీ అలరించేలా తీయొచ్చని తెలిపారు. ఈ ఫార్మాట్‌లో సిరీస్ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి సినిమాను సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలు పరిశీలించాం. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. కథతో పాటు పాత్రలు చాలా చక్కగా క్రియేట్ చేశారు. అది చూసి నాకు సంతోషంగా కలిగింది.' అని అన్నారు.
థియేటర్లో బాహుబలి చిత్రాన్ని చూసింది కేవలం 10 కోట్ల మంది మాత్రమేనని రాజమౌళి అన్నారు. అంటే మిగిలిన కోట్ల జనాభా ఏదో ఒక మాధ్యమం ద్వారా చూసి ఉంటారని తెలిపారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.. అందరూ రెగ్యులర్ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్ చిత్రాలు మాత్రమే చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్‌లో అది వర్కవుట్ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్ సిరీస్‌కు కనెక్ట్ అవుతారన అన్నారు.
యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఈ సమావేశంలో రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని.. ఎప్పుడో ఒకసారి జరుగుతుందన్నారు. నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటూనే ఉంటానని.. దీని వల్ల రానున్న సినిమాల్లో కొత్త విషయాలు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈగ సినిమాలో కొంత భాగం యానిమేషన్ ఉందని వెల్లడించారు. భవిష్యత్‌లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయన్నారు. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం ప్రిన్స్ మహేశ్‌బాబుతో తెరకెక్కించనున్నారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ డిస్నీప్లస్ మే 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది
Comments
Please login to add a commentAdd a comment