ప్రయోగాల వేళ... | India look to dismantle depleted Australia | Sakshi
Sakshi News home page

ప్రయోగాల వేళ...

Published Tue, Jan 12 2016 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

ప్రయోగాల వేళ...

ప్రయోగాల వేళ...

భారత్, ఆస్ట్రేలియాల మధ్య చివరిసారి వన్డే మ్యాచ్ జరిగినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడా ఉంది. వేదిక అదే అయినా పిచ్‌లు వేరు, జట్లు వేరు, టోర్నీ ప్రతిష్ట వేరు. ఫ్లాట్ పిచ్‌లపై ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆడిన ఈ రెండు జట్లు ఈ ఏడాదిలో చాలా మారాయి. అటు ఆస్ట్రేలియా జట్టులోనూ సీనియర్ క్రికెటర్లు వైదొలిగారు. దీంతో కంగారూలు కూడా కొన్ని కొత్త ముఖాలతో బరిలోకి దిగుతున్నారు. ఇటు భారత్ పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు. ఈసారి సిరీస్‌లో కచ్చితంగా కొత్త ఆటగాళ్లను పరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టి20 ప్రపంచకప్‌తో పాటు వచ్చే నాలుగేళ్ల భవిష్యత్ కోసం కూడా రెండు జట్లు ప్రయోగాలు చేయడానికి ఈ సిరీస్ వేదిక కానుంది.
 
* భారత్, ఆస్ట్రేలియాల తొలి వన్డే నేడు  
* ఇరు జట్లలోనూ కొత్త ముఖాలు ధోనిసేనకు పేస్ పరీక్ష


పెర్త్: టి20 ప్రపంచకప్ వరకు ధోనియే కెప్టెన్ అంటూ ప్రకటించడం ద్వారా భారత సెలక్టర్లు ఓ మంచి పని చేశారు. జార్ఖండ్ డైనమైట్ కెరీర్ గురించి జరుగుతున్న చర్చకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టారు. అదే సమయంలో మహీకి మరో పెద్ద బాధ్యతను కట్టబెట్టి ఆస్ట్రేలియాకు పంపించారు. కొత్త బ్యాట్స్‌మెన్, కొత్త ఆల్‌రౌండర్లు, కొత్త బౌలర్లను ఇచ్చి టి20 ప్రపంచకప్ సమయానికి సరైన జట్టును తయారు చేయాలనే సవాల్‌నూ కెప్టెన్ ముందు ఉంచారు.

ఈ నేపథ్యంలో నేడు (మంగళవారం) ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. అటు కంగారూలు కూడా ఇద్దరు కొత్త బౌలర్లు పారిస్, బోలాండ్‌లను ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయిస్తున్నారు. పేస్, బౌన్స్ ఉండే వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూఏసీఏ-వాకా) పిచ్‌పై ఆస్ట్రేలియాను నిలువరించాలంటే భారత్ అన్ని విభాగాల్లోనూ నిలకడను చూపించాలి.
 
బరిందర్ అరంగేట్రం...
రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో విజయాలతో భారత్ ఆత్మవిశ్వాసంతో సిరీస్‌ను ప్రారంభించబోతోంది. కీలకమైన నలుగురు బ్యాట్స్‌మెన్ కోహ్లి, ధావన్, రోహిత్, రహానే ఒక్కో మ్యాచ్‌లో బాగా ఆడారు. ఈ నలుగురిలో కనీసం ఇద్దరు కుదురుకుంటేనే భారత్‌కు భారీ స్కోరు వస్తుంది. ఈ నలుగురితో పాటు ధోనితో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఆరో బ్యాట్స్‌మన్‌గా ఎవరిని ఆడించాలనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో మనీష్ పాండే బాగా ఆడినా... గుర్‌కీరత్ ఏడాది కాలంగా దేశవాళీ మ్యాచ్‌లతో పాటు భారత్ ‘ఎ’ తరఫున నిలకడగా ఆడుతున్నాడు. గతంలో ఐదుగురు బౌలర్లు ఉన్నా... పార్ట్‌టైమ్ బౌలర్‌గా రైనా పనికొచ్చేవాడు. ఇప్పుడు రైనా లేనందున బౌలింగ్ కూడా చేయగల గుర్‌కీరత్‌కు తుది జట్టులో స్థానం లభించే అవకాశం ఉంది.
 
ఇక బౌలింగ్ విభాగంలో షమీ గాయం కారణంగా వెనుదిరగడం భారత్‌కు పెద్ద దెబ్బ. ఉమేశ్ యాదవ్‌తో కొత్త బౌలర్ బరిందర్ శరణ్ బరిలోకి దిగడం ఖాయమే. ఎడమచేతి వాటం బౌలర్ కావడం, బంతుల్లో వేగం ఉండటం వల్ల బరిందర్‌ను అరంగేట్రం చేయించే అవకాశం ఉంది. ఇద్దరు స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా తుది జట్టులో ఉంటారు. అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కావచ్చు. జట్టులో మూడో పేసర్‌గా ఇషాంత్ శర్మ బరిలోకి దిగుతాడు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆడకపోయినా... ఆల్‌రౌండర్ కంటే బౌలర్ జట్టులో ఉండాలని ధోని కోరుకుంటున్నందున ఇషాంత్ తుది జట్టులోకి రావడం ఖాయమే.
 
బౌలింగ్‌లో అనుభవలేమి
ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది. ఓపెనర్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా... ఫించ్ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సమర్థుడు. ఇక స్మిత్, బెయిలీ ఇద్దరూ నిలకడగా ఆడతారు. మ్యాక్స్‌వెల్ మెరుపు విన్యాసాలు ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకు ఇప్పటికే సుపరిచితం. మిషెల్ మార్ష్, ఫాల్క్‌నర్‌ల రూపంలో ఇద్దరు నాణ్యమైన ఆల్‌రౌండర్లు తుదిజట్టులో ఉన్నారు. వికెట్ కీపర్ వేడ్ కూడా వేగంగా ఆడటంలో సిద్ధహస్తుడు. అయితే బౌలింగ్ విభాగమే కాస్త బలహీనంగా కనిపిస్తోంది.

ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం కంగారూలకు ప్రతికూలాంశం. హాజిల్‌వుడ్‌కు కూడా పెద్దగా అనుభవం లేదు. కొత్త పేసర్లు పారిస్, బోలాండ్‌లను అరంగేట్రం చేయిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎడమచేతి వాటం పేసర్ పారిస్‌కు ‘వాకా’ సొంత మైదానం. ఇక్కడి పరిస్థితులపై అతనికి పూర్తిగా అవగాహన ఉంది. మొత్తం మీద బౌలింగ్ లైనప్ అనుభవలేమితో కనిపిస్తోంది. ఈ కొత్త బౌలర్ల సత్తా ఏంటనేది తొలి వన్డేలో ఆసక్తికర అంశం.
 
జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, గుర్‌కీరత్, జడేజా, అశ్విన్, ఉమేశ్, బరిందర్, రిషి ధావన్/ఇషాంత్ శర్మ.
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, బెయిలీ, మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్, వేడ్, ఫాల్క్‌నర్, హాజిల్‌వుడ్, పారిస్, బోలాండ్.
 
ఉ. గం. 8.50 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
1
ఆస్ట్రేలియాలో భారత్ ఆడుతున్న తొలి ద్వైపాక్షిక సిరీస్ ఇది. గతంలో చాలా వన్డేలు ఆడినా అవన్నీ ముక్కోణపు టోర్నీలో భాగం.
 
10
ఆస్ట్రేలియాలో భారత్ వారిపై గెలిచిన వన్డేలు. 31 వన్డేల్లో కంగారూల చేతిలో ఓడింది.
 
1
గత ఏడు సంవత్సరాలలో భారత్ జట్టు ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో ఆడిన ఆరు వన్డేల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది.
 
169
కోహ్లి మరో 169 పరుగులు చేస్తే 7 వేల పరుగుల మైలురాయిని చేరతాడు. ఈ సిరీస్‌లో ఇది పూర్తయితే వేగంగా 7 వేలు చేసిన క్రికెటర్‌గా కూడా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం డివిలియర్స్ (166 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. కోహ్లి ఇప్పటివరకూ కెరీర్‌లో 158 ఇన్నింగ్స్‌లో 6831 పరుగులు చేశాడు.
 
14
ఆస్ట్రేలియా సొంతగడ్డపై గత 14 వన్డేల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు.
 
‘ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడతాం. ఈ పర్యటనలో ప్రతి అవకాశం ఓ సవాల్. అలాగే యువ క్రికెటర్లకు ప్రతి సవాల్ ఓ అవకాశం. ప్రతి యువ క్రికెటర్‌కూ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎంత నైపుణ్యం ఉన్నా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడిని అధిగమించడమే కీలకం. ఆసీస్ దేశవాళీ క్రికెట్‌లో పోటీ ఎక్కువగా ఉంటుంది. జాతీయ జట్టులోకి ఇద్దరు కొత్త బౌలర్లు వచ్చారంటే కచ్చితంగా వారిలో నైపుణ్యం ఉందనే అర్థం.’                - ధోని, భారత కెప్టెన్
 
‘భారత్ బ్యాటింగ్ లైనప్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. కోహ్లి, రహానే, రోహిత్‌లాంటి నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడం ఏ ఫార్మాట్‌లో అయినా కీలకమే. పేస్ బౌలర్ ఎవరైనా పెర్త్ వికెట్‌పై బౌలింగ్ చేయడం అదృష్టం. ఇద్దరు కొత్త పేసర్లను ఈ పిచ్ మీద అరంగేట్రం చేయించడం వాళ్ల వాళ్ల కెరీర్‌కు మంచి ఆరంభం లభిస్తుంది.’
- స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్
 
పిచ్
పేస్, బౌన్స్ ఉంటుంది. ముఖ్యంగా తొలి గంట ఆటలో పేసర్లు బాగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
 
వాతావరణం
వర్షం ముప్పేమీ లేదు. గరిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement