
ఇప్పటికీ అదే ధ్యాస: ధోని
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విడదీయరాని బంధం ఏదైనా ఉందంటే చెన్నై సూపర్ కింగ్స్తోనే అనేది కాదనలేని సత్యం. ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి గతేడాది వరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని సారథిగా వ్యవరించాడు. ఆ జట్టుతో ధోనికి ఎనిమిదేళ్ల సుదీర్ఘ బంధం ఉంది. అయితే ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై, రాజస్థాన్ జట్లపై రెండేళ్లు వేటు పడింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న అనుబంధాన్ని ప్రస్తుతం పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోని మరోసారి గుర్తు చేసుకున్నాడు.
'ఇప్పటికీ అదే ధ్యాస. చెన్నై సూపర్ కింగ్స్ జర్సీ లేకుండా ఫీల్డింగ్లోకి రావడం ఏదో వెలితిగా ఉంది. నా టీ 20 క్రికెట్ ఆరంభమైన దగ్గర్నుంచీ భారత జట్టుతో పాటు జార్ఖండ్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాను. ఇందులో చెన్నైతో ఎనిమిదేళ్ల సుదీర్ఘ బంధం ఉంది. ఈసారి పసుపు కలర్ జర్సీతో కనిపించకపోవడం నిజంగానే బాధగా ఉంది. కనీసం ఆ జట్టుతో ఉన్న జ్ఞాపకాలు ఒక అంగుళం కూడా నా నుంచి పోలేదు' అని ధోని పేర్కొన్నాడు.