ధోని సరికొత్త రికార్డు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్, ఫాల్కనర్లను స్టంపింగ్ రూపంలో పెవిలియన్ కు పంపిన ధోని.. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అత్యధిక స్టంపింగ్స్(140) చేసిన వికెట్ కీపర్ గా గుర్తింపు సాధించాడు. తద్వారా అంతకుముందు శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగాక్కర అంతర్జాతీయ కెరీర్ లో నెలకొల్పిన 139 స్టంపింగ్స్ రికార్డు చెరిగిపోయింది. తొలుత యువరాజ్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ క్రీజ్ ను వదిలి కొద్దిగా ముందుకు వెళ్లి బంతిని హిట్ చేయబోయి ధోనికి దొరికిపోగా, ఆ తరువాత ఫాల్కనర్ ను తన ప్యాడ్లతో బంతిని వికెట్లపైకి తోసి ధోని సక్సెస్ అయ్యాడు. ధోని చేసిన ఆ రెండు స్టంపింగ్స్ తో నే మ్యాచ్ ఆసీస్ చేతుల్లోంచి పూర్తిగా చేజారిపోయింది.
రెండో ట్వంటీ 20లో ఆసీస్ పై టీమిండియా 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0 తేడాతో దక్కించుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్(60;47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ధావన్(42;32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్(59 నాటౌట్;33 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్) దాటిగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరులో సహకరించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 20.0ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులకే చాపచుట్టేసి ఓటమి చెందింది. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్(74;48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా , బూమ్రాలకు చెరో రెండు వికెట్లు దక్కగా, అశ్విన్, పాండ్యా, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది.