international matches
-
చరిత్ర సృష్టించిన రొనాల్డో..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో జట్టును గెలిపించడంలో విఫలమైన రొనాల్డో జర్మనీ వేదికగా జరుగుతున్న యూరోకప్ 2024 క్వాలిఫయర్‌లో మాత్రం దుమ్మురేపాడు. గ్రూప్-జెలో భాగంగా గురువారం లిచెన్‌స్టెయిన్, పోర్చుగల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రొనాల్డోకు 197వది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక దేశం తరపున(పోర్చుగల్) తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు 196 మ్యాచ్‌లతో కువైట్‌కు చెందిన బాదర్ అల్-ముతావాతో సమంగా ఉన్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా మొరాకోతో జరిగిన క్వార్టర్స్ ఫైనల్ రొనాల్డోకు 196వ మ్యాచ్. ఇక మ్యాచ్‌లోనూ రొనాల్డో రెండు గోల్స్‌తో అదరగొట్టాడు. ఆట 51వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన రొనాల్డో ఆట 63వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో పోర్చుగల్ 4-0 తేడాతో లిచెన్స్టెయిన్ను చిత్తుగా ఓడించింది. ఇక ఓవరాల్‌గా పోర్చుగల్ తరపున 197 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 120 గోల్స్ కొట్టి ఆల్‌టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 💚❤️1⃣9⃣7⃣ Take a bow, @Cristiano 👏👏👏#EURO2024 pic.twitter.com/ArgPz0MEYD — UEFA EURO 2024 (@EURO2024) March 23, 2023 -
బంగ్లాపై టీమిండియా విజయం.. విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు
Virat Kohli: చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జకీర్ హసన్ క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య 291కి చేరింది. మూడు ఫార్మాట్లలో 482 మ్యాచ్‌ల్లో 572 ఇన్నింగ్స్‌ల్లో బరిలోకి దిగిన కోహ్లి ఈ ఫిగర్‌ను చేరుకున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే (768 ఇన్నింగ్స్‌ల్లో 440 క్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (364), న్యూజిలాండ్ మాజీ సారధి రాస్ టేలర్ (351), సౌతాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ (338), ద వాల్ రాహుల్ ద్రవిడ్ (334), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (306), సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (292)లు కోహ్లి కంటే ముందున్నారు. కోహ్లి ఈ ఫీట్ సాధించడంతో అతని అభిమానులు సంబురపడిపోతున్నారు. రన్‌మెషీన్, కింగ్ కోహ్లి, క్యాచింగ్‌లోనూ కింగే అంటూ సంకలు గుద్దుకుంటున్నారు. -
గుణతిలకపై ఆరు మ్యాచ్‌ల నిషేధం
కొలంబో: శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలకపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం విధించింది. ప్రవర్తన నియమావళిని పదే పదే ఉల్లఘించినందుకు గాను ఈ చర్యలు తీసుకుంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా అతని చర్యలను సీరియస్‌గా పరిగణించిన బోర్డు సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్ ఫీజు, బోనస్‌లు కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. తాజా తప్పిదం కారణంగా అతనిపై మూడు మ్యాచ్‌ల వేటు పడగా... గతేడాది అక్టోబర్‌లో కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించిన గుణతిలక ఏడాదిలోపే మరోసారి నిబంధనలు అతిక్రమించడంతో మరో మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్ పడింది. గతేడాది కూడా అతడు ఆరు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొనగా, తర్వాత బోర్డు దాన్ని మూడు మ్యాచ్‌లకు కుదించింది. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా జట్టు బస చేసిన హోటల్లోని గుణతిలక గదిలో ఓ నార్వే మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంలో గుణతిలకకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే తేల్చిన పోలీసులు... అతని స్నేహితుడు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానించి అరెస్ట్ చేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ తరచూ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తుండటంతో బోర్డు అతనిపై కఠిన చర్యలకు పూనుకుంది. ఈ సస్పెన్షన్ అనంతరం అతను తిరిగి జట్టులోకి ఎంపికవుతాడో లేదో చూడాలి. -
ధోని సరికొత్త రికార్డు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్, ఫాల్కనర్లను స్టంపింగ్ రూపంలో పెవిలియన్ కు పంపిన ధోని.. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అత్యధిక స్టంపింగ్స్(140) చేసిన వికెట్ కీపర్ గా గుర్తింపు సాధించాడు. తద్వారా అంతకుముందు శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగాక్కర అంతర్జాతీయ కెరీర్ లో నెలకొల్పిన 139 స్టంపింగ్స్ రికార్డు చెరిగిపోయింది. తొలుత యువరాజ్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ క్రీజ్ ను వదిలి కొద్దిగా ముందుకు వెళ్లి బంతిని హిట్ చేయబోయి ధోనికి దొరికిపోగా, ఆ తరువాత ఫాల్కనర్ ను తన ప్యాడ్లతో బంతిని వికెట్లపైకి తోసి ధోని సక్సెస్ అయ్యాడు. ధోని చేసిన ఆ రెండు స్టంపింగ్స్ తో నే మ్యాచ్ ఆసీస్ చేతుల్లోంచి పూర్తిగా చేజారిపోయింది. రెండో ట్వంటీ 20లో ఆసీస్ పై టీమిండియా 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0 తేడాతో దక్కించుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్(60;47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ధావన్(42;32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్(59 నాటౌట్;33 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్) దాటిగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరులో సహకరించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 20.0ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులకే చాపచుట్టేసి ఓటమి చెందింది. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్(74;48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా , బూమ్రాలకు చెరో రెండు వికెట్లు దక్కగా, అశ్విన్, పాండ్యా, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది.