![Gunathilaka suspended for six international matches - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/28/GUNATHILAKA-3FC.jpg.webp?itok=kuCnY9y3)
కొలంబో: శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలకపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం విధించింది. ప్రవర్తన నియమావళిని పదే పదే ఉల్లఘించినందుకు గాను ఈ చర్యలు తీసుకుంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా అతని చర్యలను సీరియస్‌గా పరిగణించిన బోర్డు సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్ ఫీజు, బోనస్‌లు కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. తాజా తప్పిదం కారణంగా అతనిపై మూడు మ్యాచ్‌ల వేటు పడగా... గతేడాది అక్టోబర్‌లో కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించిన గుణతిలక ఏడాదిలోపే మరోసారి నిబంధనలు అతిక్రమించడంతో మరో మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్ పడింది. గతేడాది కూడా అతడు ఆరు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొనగా, తర్వాత బోర్డు దాన్ని మూడు మ్యాచ్‌లకు కుదించింది.
దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా జట్టు బస చేసిన హోటల్‌లోని గుణతిలక గదిలో ఓ నార్వే మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంలో గుణతిలకకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే తేల్చిన పోలీసులు... అతని స్నేహితుడు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానించి అరెస్ట్ చేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ తరచూ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తుండటంతో బోర్డు అతనిపై కఠిన చర్యలకు పూనుకుంది. ఈ సస్పెన్షన్ అనంతరం అతను తిరిగి జట్టులోకి ఎంపికవుతాడో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment