Virat Kohli: చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జకీర్ హసన్ క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య 291కి చేరింది. మూడు ఫార్మాట్లలో 482 మ్యాచ్‌ల్లో 572 ఇన్నింగ్స్‌ల్లో బరిలోకి దిగిన కోహ్లి ఈ ఫిగర్‌ను చేరుకున్నాడు.
ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే (768 ఇన్నింగ్స్‌ల్లో 440 క్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (364), న్యూజిలాండ్ మాజీ సారధి రాస్ టేలర్ (351), సౌతాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ (338), ద వాల్ రాహుల్ ద్రవిడ్ (334), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (306), సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (292)లు కోహ్లి కంటే ముందున్నారు. కోహ్లి ఈ ఫీట్ సాధించడంతో అతని అభిమానులు సంబురపడిపోతున్నారు. రన్‌మెషీన్, కింగ్ కోహ్లి, క్యాచింగ్‌లోనూ కింగే అంటూ సంకలు గుద్దుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment