Ind vs Ban: Virat Kohli Continues his Poor form in Test Format - Sakshi
Sakshi News home page

IND VS BAN 1st Test: మూడేళ్లయినా తీరని 'ఆ' ముచ్చట..!

Published Wed, Dec 14 2022 4:21 PM | Last Updated on Wed, Dec 14 2022 5:15 PM

Virat Kohli Out For 1 Run In First Test Vs Bangladesh, Continues Poor Form In Long Format - Sakshi

టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. చట్టోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 14) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో 5 బంతులు ఎదుర్కొన్న కింగ్‌.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో గత 33 ఇన్నింగ్స్‌లుగా మూడంకెల ముచ్చట తీరని కోహ్లికి ఈ మ్యాచ్‌లోనూ నిరాశే ఎదురైంది.

టీ20ల్లో, వన్డేల్లో ఫామ్‌ను అందుకున్న కోహ్లి.. టెస్ట్‌ల్లో సైతం చెలరేగుతాడని అంతా భావించారు. అయితే అతను పట్టుమని 10 బంతులు కూడా ఆడకుండా తస్సుమనిపించాడు. టెస్ట్‌ల్లో కోహ్లి సెంచరీ చేసి మూడేళ్లు పూర్తి అయిపోయింది. ఈ ఫార్మాట్‌లో అతను చివరిసారిగా 2019 నవంబర్‌లో సెంచరీ చేశాడు.

కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే అండ్‌ నైట్‌ టెస్ట్‌లో కోహ్లి 136 పరుగులు సాధించాడు. నాటి నుంచి 33 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి.. 26.45 సగటున కేవలం 873 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోర్‌ 79.   

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా (203 బంతుల్లో 90; 11 ఫోర్లు) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ 82 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా పుజారా, శ్రేయస్‌ భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు.

కేఎల్‌ రాహుల్‌ (22), శుభ్‌మన్‌ గిల్‌ (20), విరాట్‌ కోహ్లి (1) నిరాశపర్చగా.. రిషబ్‌ పంత్‌ (46) పర్వాలేదనిపించాడు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్‌ పటేల్‌ (14) ఔట్‌ కావడంతో ఆటకు తెరపడింది. శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజ్‌లో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్‌ 2, ఖలీద్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement