కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపించిన లంక మాజీ మంత్రి మహిదానంద అలుత్‌గమగే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఆరోపణల్లో తాను ఏ క్రికెటర్ గురించీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదని... కుమార సంగక్కర, మహేల జయవర్ధనే ఎందుకు అతిగా స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ‘సర్కస్ మొదలైందని మహేల చెబుతున్నాడు. ఈ విషయంలో వారిద్దరు ఎందుకు ఇంత అతిగా స్పందిస్తున్నారో నాకర్థం కావడం లేదు. పైగా నేను ఏ ఆటగాడి పేరు తీసుకోలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి గతంలోనూ అర్జున రణతుంగ కూడా బహిరంగంగానే మాట్లాడారు. ఇదేమీ మొదటిసారి కాదు’ అని మహిదానంద వ్యాఖ్యానించారు. మరోవైపు తాజా వివాదంపై జయవర్ధనే మళ్లీ స్పందించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ మాజీ కెప్టెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణ చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment