న్యూఢిల్లీ: "ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్"కు ఎంపికైన నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేపై శ్రీలంక, పాకిస్తాన్‌లకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపానని లంక ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాడు సంగక్కర కొనియాడాడు. వేగం, కచ్చితత్వం అతని ప్రధాన ఆయుధాలని, వీటితో కెరీర్ ఆసాంతం తనను చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. అతని ఎత్తు అతనికి అడ్వాంటేజ్ అని, దాని వల్ల అతను విసిరిన బంతులు బాగా బౌన్స్ అయ్యేవని గుర్తు చేసుకున్నాడు. బౌలర్‌గా తనను ఇబ్బంది పెట్టినా, వ్యక్తిగతంగా చాలా మంచివాడని పొగడ్తలతో ముంచెత్తాడు.
బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసేందుకు కుంబ్లే వద్ద పక్కా ప్రణాళిక ఉంటుందని, దాన్ని అతను తూచా తప్పకుండా అమలు చేసి సత్ఫలితాలు సాధించాడని మరో శ్రీలంక ఆటగాడు జయవర్ధనే పేర్కొన్నాడు. కుంబ్లే బలాలేంటో తనకు బాగా తెలుసని, తన బంతుల ద్వారా అతడు బ్యాట్స్‌మన్‌ను ప్రశ్నిస్తూనే ఉంటాడని అతను వెల్లడించాడు. ఇదిలా ఉంటే బౌలర్లు సైతం కుంబ్లేను ఆకాశానికెత్తారు. పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ కుంబ్లేను ప్రశంసలతో ముంచెత్తాడు. ఢిల్లీలో కుంబ్లే తమపై 10 వికెట్లు తీయడం తన కళ్లెదుటే మెదులుతుందని, అతని పదో వికెట్ నేనే కావడంతో ఆ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నాడు. కాగా, కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అతను టీమిండియా కోచ్‌గా కూడా పనిచేశాడు.
చదవండి: ఇంగ్లండ్‌లో ఐపీఎల్ నిర్వహణ డౌటే..
Comments
Please login to add a commentAdd a comment