రహానే తెలివైన బ్యాట్స్‌మన్
అనిల్ కుంబ్లే
రెండో టెస్టు మూడు, నాలుగో రోజుల్లో భారత ఆటగాళ్ల నుంచి మంచి ప్రదర్శనే వచ్చింది. ఈ ఆటతో చివరి టెస్టుకు 1-1తో వెళ్లగలిగే అవకాశం చిక్కింది. నిజానికి భారత జట్టు తొలి టెస్టులోనే నెగ్గాల్సింది. ఇప్పుడు కోహ్లి బృందానికి ఇంతకన్నా మంచి తరుణం లేదు. మరోవైపు ఆదివారం శ్రీలంక క్రికెట్ తమ దిగ్గజ ఆటగాడి ఆటను చివరిసారిగా చూసేసింది. సంగక్కర తన దేశం తరఫున చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. అయితే కెరీర్‌లో ఆఖరి టెస్టును విజయంతో ముగించడం అనుమానమే. అయితే మరోవైపు ఇంగ్లండ్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మైకేల్ క్లార్క్ ఆసీస్ ఓదార్పు విజయంతో కెరీర్‌కు ముగింపు పలికాడు.
ఇక నాలుగో రోజు ఆటలో భారత బ్యాటింగ్ మూడో స్థానంలో ఓ కొత్త అధ్యాయానికి సంకేతాలు పంపినట్టయ్యింది. దీంతో రహానే స్థానంపై కొద్దికాలమైనా చర్చలకు తెర పడతాయోమే. ఎందుకంటే అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో పాటు మరో సెంచరీ సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. రహానే తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇంగ్లండ్, ఆసీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఇలా ఏ దేశంలో ఆడినా పరిస్థితులను చాలా త్వరగా అర్థం చేసుకోగలిగాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో తన స్థానం అటు ఇటూ ఎలా మార్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా రాణిస్తున్నాడు. సరైన సమయంలో ఓ యువ బ్యాట్స్‌మన్ మూడో స్థానంలో ఆడి శతకం చేయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను.
మొత్తానికి ఈ నాలుగు రోజుల బాధ్యతాయుతమైన ఆటతీరును భారత ఆటగాళ్లు వృథా చేసుకోరాదు. ఓ యూనిట్‌గా తొలి ఇన్నింగ్స్‌లో చాలా ఓపిక ప్రదర్శించారు. ఇదే రీతిన చివరి రోజు కూడా చూపితే విరాట్ కోహ్లి తన ఖాతాలో తొలి కెప్టెన్సీ విజయాన్ని అందుకుంటాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌ను కోహ్లి, మ్యాథ్యూస్, స్టీవ్ స్మిత్ రూపంలో నూతన జనరేషన్ తమ చేతుల్లోకి తీసుకోవడంతో మున్ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.