ఈసారి వదలొద్దు!
చేజేతులా తొలి టెస్టును జారవిడుచుకున్న భారత్‌కు లంక గడ్డపై గెలిచేందుకు మరో అవకాశం వచ్చింది. రహానే సూపర్ బ్యాటింగ్‌కు తోడు అశ్విన్ స్పిన్ మాయాజాలంతో రెండో టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. లంక విజయానికి ఇంకా 341 పరుగులు అవసరంకాగా, భారత్ విజయానికి 8 వికెట్లు మాత్రమే చాలు. పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరిస్తుం డటంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని వదులుకోవద్దని కోహ్లి సేన పట్టుదలతో ఉంది.
కొలంబో: అజింక్యా రహానే (243 బంతుల్లో 126; 10 ఫోర్లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో రెండో టెస్టులో భారత్... శ్రీలంక ముందు 413 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు ఆదివారం నాలుగో రోజు బరిలోకి దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 2 వికెట్లకు 72 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి కరుణరత్నే (25 బ్యాటింగ్), కెప్టెన్ మ్యాథ్యూస్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 70/1తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 91 ఓవర్లలో 8 వికెట్లకు 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రహానేకు తోడు విజయ్ (133 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. లంక బౌలర్లలో ప్రసాద్, కౌశల్ చెరో 4 వికెట్లు తీశారు.
నమన్ ఓజా, కరుణ్‌లకు పిలుపు
కండరాల గాయంతో తొలిటెస్టుకు దూరమైన ఓపెనర్ మురళీ విజయ్‌కి రెండో టెస్టు సందర్భంగా మళ్లీ గాయం తిరగబెట్టింది. ఫలితంగా ఈ నెల 28 నుంచి జరిగే మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉండటంలేదు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా కండరాల గాయంతో మూడో టెస్టుకు దూరమ య్యాడు. వీరిద్దరి స్థానాల్లో నమన్ ఓజా, కరుణ్ నాయర్‌లను మూడో టెస్టుకోసం ఎంపిక చేశారు.
నాలుగు రోజుల పాటు మంచి క్రికెట్ ఆడాం. ఇక ఐదో రోజు మరింత ఓపికగా ఉండాలి. ఇది చాలా కీలకం. ఎందుకంటే పిచ్ బాగా నెమ్మదైంది. కాబట్టి మంచి భాగస్వామ్యాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్క సెషన్ మేం బాగా ఆడగలిగితే మ్యాచ్ గెలిచినట్లే. నాలుగో రోజు మంచి భాగస్వామ్యాలను ఏర్పర్చడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టాం. విజయ్ బాగా ఆడాడు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ గురించి చాలా చర్చించుకున్నాం. రోహిత్, నా మధ్య నెలకొన్న భాగస్వామ్యం కూడా చాలా కీలకమైంది. -రహానే (భారత బ్యాట్స్‌మన్)
సెషన్ 1
ఆ ఇద్దరి ఆధిపత్యం...
ఈ సెషన్‌లో మొదటి గంట ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రహానే, విజయ్‌లు ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా... తర్వాత బ్యాట్లు ఝళిపించారు. ఈ క్రమంలో 36వ ఓవర్‌లో విజయ్ 104 బంతుల్లో 11వ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆ వెంటనే రహానే 118 బంతుల్లో 8వ అర్ధశతకం సాధించాడు. వీరిద్దరి జోరుతో భారత్‌కు 13.4 ఓవర్లలో 68 పరుగులు సమకూరాయి. అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడిని 46వ ఓవర్‌లో కౌశల్ విడగొట్టాడు. విజయ్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపడంతో రెండో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన కెప్టెన్ కోహ్లి (10) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో లంచ్‌కు కొద్ది ముందు అవుటయ్యాడు. అయితే రోహిత్ శర్మ (34), రహానే మరో వికెట్ పడకుండా 179/3 స్కోరుతో లంచ్‌కు వెళ్లారు.
ఓవర్లు: 27; పరుగులు: 109; వికెట్లు: 2
సెషన్ 2
కొనసాగిన జోరు...
వీలైనంత త్వరగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో లంచ్ తర్వాత రహానే, రోహిత్ వేగంగా ఆడారు. కానీ లంక బౌలర్ కౌశల్ రౌండ్ ది వికెట్‌తో ఈ జోడిని కట్టడి చేశాడు. దీంతో రన్‌రేట్ ఓవర్‌కు మూడు పరుగుల కంటే తక్కువగా నమోదైంది. ఈ క్రమంలో 67వ ఓవర్‌లో రహానే 212 బంతుల్లో కెరీర్‌లో 4వ శతకం పూర్తి చేశాడు. ఇదే ఓవర్‌లో భారత్ 300 స్కోరునూ అందుకుంది. తర్వాత ఈ ఇద్దరు అటాకింగ్‌కు దిగినా... మూడు ఓవర్ల తేడాలో ఈ ఇద్దరు అవుటయ్యారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఈ దశలో బిన్నీ (17)తో జతకలిసిన సాహా (13 నాటౌట్) కొద్దిసేపు ఆడిన తర్వాత కాలిపిక్క కండరం పట్టేయడంతో రిటైర్‌హర్ట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన అశ్విన్ (19)... బిన్నీకి చక్కని సహకారం అందిస్తూ మరో వికెట్ పడకుండా సెషన్ ముగించాడు.
ఓవర్లు: 26; పరుగులు: 104; వికెట్లు: 2
సెషన్ 3
అశ్విన్ అదుర్స్...
టీ తర్వాత తొలి బంతికే బిన్నీ అవుట్‌కాగా... మిశ్రా (10) బ్యాటింగ్‌కు వచ్చాడు. రెండో ఎండ్‌లో అశ్విన్ రెండు ఫోర్లు, సిక్స్ బాదడంతో భారత్‌కు 400 పరుగుల స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఏడో వికెట్‌కు 28 పరుగులు జోడించాక అశ్విన్ వెనుదిరిగాడు. ఈ దశలో సాహా మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చినా... 89వ ఓవర్‌లో మిశ్రాను ప్రసాద్ బోల్తా కొట్టించాడు. ఉమేశ్ (4 నాటౌట్), సాహాలు కొద్దిసేపు ఆడిన తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన లంకను అశ్విన్ దెబ్బతీశాడు. ఉమేశ్‌తో కలిసి బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ మూడో ఓవర్‌లోనే సిల్వ (1)ను వెనక్కిపంపాడు. దీంతో లంక స్కోరు 8/1గా మారింది. సంగక్కర (18) నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేసినా... మళ్లీ అశ్విన్‌కే వికెట్‌ను సమర్పించుకున్నాడు. కరుణరత్నేతో కలిసి రెండో వికెట్‌కు అతను 25 పరుగులు జోడించాడు. సాహా స్థానంలో రాహుల్ కీపింగ్ చేశాడు. మ్యాథ్యూస్, కరుణరత్నేలు మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
ఓవర్లు: 9; పరుగులు: 42; వికెట్లు: 3 (భారత్)
ఓవర్లు: 21; పరుగులు: 72; వికెట్లు: 2 (శ్రీలంక)
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 393 ఆలౌట్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 306 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) కౌశల్ 82; రాహుల్ (బి) ప్రసాద్ 2; రహానే (సి) చండిమల్ (బి) కౌశల్ 126; కోహ్లి ఎల్బీడబ్ల్యు (బి) కౌశల్ 10; రోహిత్ (సి) ముబారక్ (బి) కౌశల్ 34; బిన్నీ (సి) తిరిమన్నే (బి) ప్రసాద్ 17; సాహా నాటౌట్ 13; అశ్విన్ (సి) చండిమల్ (బి) ప్రసాద్ 19; మిశ్రా (సి) ముబారక్ (బి) ప్రసాద్ 10; ఉమేశ్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (91 ఓవర్లలో 8 వికెట్లకు) 325 డిక్లేర్డ్
వికెట్ల పతనం: 1-3; 2-143; 3-171; 4-256; 5-262; 6-283; 7-311; 8-318.
బౌలింగ్: ప్రసాద్ 15-0-43-4; హెరాత్ 29-4-96-0; చమీరా 14-0-63-0; మ్యాథ్యూస్ 2-1-1-0; కౌశల్ 31-1-118-4.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: సిల్వ (సి) బిన్నీ (బి) అశ్విన్ 1; కరుణరత్నే బ్యాటింగ్ 25; సంగక్కర (సి) విజయ్ (బి) అశ్విన్ 18; మ్యాథ్యూస్ బ్యాటింగ్ 23; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (21 ఓవర్లలో 2 వికెట్లకు) 72.
వికెట్ల పతనం: 1-8; 2-33.
బౌలింగ్: అశ్విన్ 10-5-27-2; ఉమేశ్ 2-0-10-0; ఇషాంత్ 4-0-18-0; మిశ్రా 5-1-13-0.