
న్యూఢిల్లీ: సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలిద్దరు దక్షిణాఫ్రికా పిచ్‌లకు అనుగుణంగా తమ బౌలింగ్ శైలి మార్చుకోవాలని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రహానే సూచించాడు. జాతీయ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘సొంతగడ్డపైనే కాదు విదేశాల్లోనూ వాళ్లిద్దరు విజయవంతం కావాలి. భారత పిచ్‌లపై ఎలా బౌలింగ్ వేయాలో వాళ్లకు బాగా తెలుసు.
అలాగే విదేశీ పిచ్‌లపై కూడా తెలుసుకోవాలి. మొయిన్ అలీ (ఇంగ్లండ్), లయన్ (ఆసీస్) దేశం మారితే వాళ్ల శైలి మార్చుకుంటారు. భిన్నమైన శైలితో ఫలితాలు రాబడతారు’ అని అన్నాడు. కెప్టెన్ కోహ్లి, కోచ్ రవి శాస్త్రిలు జట్టులోని ఆటగాళ్లందరికీ మద్దతుగా ఉంటారని, బాగా రాణించేందుకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చాడు.