సమరానికి సై... | india and austria first test match today | Sakshi
Sakshi News home page

సమరానికి సై...

Published Thu, Feb 23 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

సమరానికి సై...

సమరానికి సై...

నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు
ఉత్సాహంతో కోహ్లి సేన 
తీవ్ర ఒత్తిడిలో కంగారూలు


వేదిక ఏదైనా వరుసగా 19 టెస్టుల్లో పరాజయం దగ్గరికే రాలేదు. సొంతగడ్డపై అయితే గత 20 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించగా ఒక్క ఓటమి కూడా లేదు. నాలుగేళ్ల క్రితం ఇక్కడే కలిసికట్టుగా 53 వికెట్లు తీసి ఆసీస్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు బౌలర్లు ఇప్పుడు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక ఎదురులేని బ్యాటింగ్‌తో ప్రత్యర్థుల పని పడుతున్న ఆటగాడు ముందుండి నడిపిస్తుండగా జట్టులో ప్రతీ ఒక్కరు మరొకరితో పోటీ పడుతూ అద్భుత ప్రదర్శన ఇస్తున్నారు. ఇదీ వరల్డ్‌ నంబర్‌వన్‌ భారత్‌ తాజా స్థితి. ఈ జట్టు జోరును ఆపడం సాధ్యమా...

ఎప్పుడో 13 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. ఆ తర్వాత ఇక్కడ ఆడిన పది టెస్టుల్లో ఎనిమిది ఓడి అతి కష్టంగా రెండింటిలో ‘డ్రా’తో బయటపడింది. అనేక మంది దిగ్గజాలు ఉన్న నాటి ఆసీస్‌ జట్లు కూడా భారత్‌ ధాటికి నిలువలేకపోయాయి. ఇప్పుడు స్పిన్‌ పిచ్‌లపై ఆడటంలో ఏ మాత్రం అనుభవం లేని యువ ఆటగాళ్లను నమ్ముకొని ఆసీస్‌ భారత్‌లో అడుగు పెట్టింది. ఉపఖండంలో గత తొమ్మిది టెస్టుల్లో నూ చిత్తుగా ఓడిన ఆ జట్టు, అసలు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో అసలు ఏమాత్రమైనా నిలబడగలదా లేక పట్టుదలతో పోరాడుతుందా?

పుణే: న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా వంతు వచ్చింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తున్న జట్టుతో తలపడేందుకు ఇప్పుడు కంగారూల బృందం సన్నద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌ లో భాగంగా నేడు (గురువారం) తొలి టెస్టు ప్రారంభమవుతుంది. భారత్‌ వరుసగా ఆరు టెస్టు సిరీస్‌లు గెలిచి ఊపు మీదుండగా, ఆసీస్‌ ఇటీవలే స్వదేశంలో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. అయితే అక్కడికంటే పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో జరిగే ఈ మ్యాచ్‌లలో ఆసీస్‌ అదే తరహా ఆటతీరును ప్రదర్శించడం అంత సులువు కాదు. మరోవైపు జట్టులో ప్రతీ ఆటగాడు ఫామ్‌లో ఉండటంతో వరుస విజ యాలు సాధించిన కోహ్లి సేన మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య భారత గడ్డపై 2013లో జరిగిన సిరీస్‌లో ఆసీస్‌ 0–4తో ఓడగా, ఆఖరిసారిగా ఈ రెండు జట్లు ఆస్ట్రేలియాలో 2014లో తలపడిన సిరీస్‌లో ఆసీస్‌ 2–0తో నెగ్గింది.

ముగ్గురు స్పిన్నర్లతో...
ఈ సీజన్‌లో ఆడిన మూడు టెస్టు సిరీస్‌లలో కూడా భారత్‌లో పిచ్‌లపై ఎలాంటి విమర్శలు రాలేదు. పూర్తిగా స్పిన్‌ పిచ్‌లను వాడుకొని ఫలితం సాధించారని ప్రశ్నించే అవకాశం లేకుండా అన్ని మైదానాల్లో అన్ని రకాల పరిస్థితుల్లో జట్టు విజయాలు అందుకుంది. జట్టులో అందరూ ఫామ్‌లో ఉండటంతో మరింత ఆత్మవిశ్వాసంతో ఈ సిరీస్‌కు భారత్‌ సిద్ధమైంది. విజయ్, రాహుల్, పుజారా, రహానేలతో బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. కోహ్లి భీకర బ్యాటింగ్‌ విషయంలో మరో మాటకు తావు లేదు. వెస్టిండీస్‌ పర్యటన నుంచి చూస్తే గత 13 టెస్టుల్లో కోహ్లి 80కు పైగా సగటుతో 1,457 పరుగులు సాధించాడు. వరుసగా నాలుగు సిరీస్‌లలో ‘డబుల్‌ సెంచరీలు’ అతని ఖాతాలో ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో కీపర్‌ సాహా కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఇక అశ్విన్, జడేజాల బ్యాటింగ్‌ విషయంలో కూడా ఎలాంటి సందేహాలు లేవు. గత టెస్టుతో పోలిస్తే ఈసారి స్పిన్‌ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని భారత్‌ భావిస్తోంది. అందుకే ఒక పేసర్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక మన స్పిన్‌ జంట మరోసారి ప్రత్యర్థిని కుప్పకూల్చేందుకు అస్త్రాలతో సిద్ధమైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న అశ్విన్, నంబర్‌టూ జడేజా మరోసారి భారత భాగ్యచక్రాన్ని పరుగెత్తించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. గత 13 టెస్టుల్లో అశ్విన్‌ ఏకంగా 78 వికెట్లు తీయగా, 10 టెస్టుల్లో జడేజాకు 49 వికెట్లు దక్కాయి. జడేజా కెరీర్‌లో తీసిన 117 వికెట్లలో 96 భారత గడ్డపైనే వచ్చాయంటే అతను ఇక్కడ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది.

ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వాలన్నా, ప్రత్యర్థికి దీటుగా బరిలో నిలవాలన్నా ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్‌పైనే అంతా ఆధారపడి ఉంది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌తో పాటు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌లను ఆ జట్టు ప్రధానంగా నమ్ముకుంటోంది. భారత్‌లో వార్నర్‌ గత రికార్డు అంత గొప్పగా ఏమీ లేకపోయినా... ఐపీఎల్‌ అనుభవం, ఇటీవలి ఫామ్‌ వల్ల అతను ఈ సారి మరింత మెరుగ్గా ఆడగలడని ఆసీస్‌ భావిస్తోంది. గత కెప్టెన్‌ క్లార్క్‌లాగే స్మిత్‌కు కూడా స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల నైపుణ్యం ఉంది. అతను పట్టుదలగా క్రీజ్‌లో నిలబడగలిగితే ఆసీస్‌ అవకాశాలు మెరుగు పడతాయి. ఇటీవలే శ్రీలంక చేతిలో 0–3తో చిత్తుగా ఓడినప్పుడు కూడా మంచి ప్రదర్శన కనబర్చిన షాన్‌ మార్‌‡్ష స్పిన్‌ను బాగా ఆడగలడు. మరోవైపు భారత్‌తో పోలిస్తే ఆసీస్‌ స్పిన్‌ విభాగం బలహీనంగానే ఉంది. గతంలో ఇక్కడ ఆడినప్పుడు ప్రభావం చూపిన నాథన్‌ లియోన్‌తో పాటు ఓ కీఫ్‌లను ఆ జట్టులో ప్రధాన స్పిన్నర్లు. లెగ్‌ స్పిన్నర్‌ స్వెప్సన్‌కు అప్పుడే అవకాశం దక్కకపోవచ్చు కానీ పిచ్‌ను బట్టి మూడో స్పిన్నర్‌ అవసరమైతే అగర్‌ లేదా మ్యాక్స్‌వెల్‌కు చోటు లభి స్తుంది. మరోవైపు స్టార్క్, హాజల్‌వుడ్‌ రూపంలో ఆ జట్టులో ఇద్దరు బ లమైన పేసర్లు ఉం డటం కలిసొచ్చే అంశం.  

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, జడేజా, జయంత్, ఉమేశ్, ఇషాంత్‌/భువనేశ్వర్‌.
ఆస్ట్రేలియా: స్మిత్‌ (కెప్టెన్‌), వార్నర్, రెన్‌షా, షాన్‌ మార్‌ష, హ్యాండ్స్‌కోంబ్, మిషెల్‌ మార్ అగర్, వేడ్, స్టార్క్, కీఫ్, లియోన్, హాజల్‌వుడ్‌.

నా కెప్టెన్సీ గురించి విశ్లేషించేందుకు ఇది సరైన సమయం కాదు. మరికొన్నేళ్ల తర్వాత కూడా నేను కెప్టెన్‌గానే ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. జట్టు బాగా ఆడినప్పుడే కెప్టెన్సీ కూడా బాగుంటుంది. అయితే నాయకుడినయ్యాక నా ఆట ఇంకా మెరుగు పడిందని మాత్రం చెప్పగలను. మా దృష్టిలో అన్ని సిరీస్‌లూ సమానమే. బంగ్లాదేశ్‌లాగే ఆస్ట్రేలియా జట్టును కూడా గౌరవిస్తాం. ఈ సీజన్‌లో అన్ని జట్లు మాకు గట్టిపోటీనే ఇచ్చాయి. ఈ వేసవి ఆరంభంలో భారత్‌లో పిచ్‌లు పొడిగా ఉండి స్పిన్‌కు అనుకూలించడం సహజం.  
–విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌

మాకు సంబంధించి ఇది కఠినమైన సిరీస్‌ కాబోతుందని తెలుసు. భారత జట్టులో 1 నుంచి 11 వరకు కూడా నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. 0–4తో సిరీస్‌ ఓడిపోతామని కొందరు చేసిన వ్యాఖ్యలకు నేను ప్రాధాన్యతనివ్వను. మా జట్టుకు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉంది. సిరీస్‌ హోరాహోరీగా జరుగుతుంది. పేసర్‌ స్టార్క్‌ ఇక్కడా మా ప్రధాన ఆయుధం కాగలడు. శ్రీలంక సిరీస్‌ పరాజయం మాకు పాఠాలు నేర్పింది. ఈ సారి తగిన వ్యూహాలతో వచ్చాం.
– స్టీవ్‌ స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్‌  

ఉదయం గం. 9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం
25 భారత్‌లో పుణే 25వ టెస్టు వేదిక

పిచ్, వాతావరణం
పుణే మైదానంలో ఇదే తొలి టెస్టు మ్యాచ్‌. పిచ్‌ బాగా పొడిగా కనిపిస్తోంది. తొలి రోజునుంచే బంతి టర్న్‌ అయ్యేందుకు అనుకూలం. కొంత రివర్స్‌ స్వింగ్‌కూ అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement