కొలంబో: శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌పై ఆరోపణలు గుప్పించారు. భారత్, శ్రీలంకల మధ్య జరిగిన టైటిల్ పోరు ఫిక్సయిందన్నారు. దీనిపై అప్పటి లంక సారథి కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోపణలపై ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందనంద మాట్లాడుతూ ‘మీకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. 2011 లేదంటే 2012 ఏడాదో సరిగ్గా గుర్తుకు రావడం లేదు కానీ... ఫైనల్ మ్యాచ్ మేం గెలవాల్సింది. అయితే ఇది తెలియజేయడం నా బాధ్యతని చెబుతున్నా... ఆ మ్యాచ్ ఫిక్సయింది.
ప్రజలు దీనిపై కలత చెందారని తెలుసు. దీనిపై ఏ చర్చకైనా నేను సిద్ధం’ అని అన్నారు. అయితే ఈ ఫిక్సింగ్‌లో లంక ఆటగాళ్లెవరూ పాల్గొనలేదని, కొన్ని వర్గాలు ఇందులో భాగమయ్యాయని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆయన క్రీడల మంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి ఆరోపణలపై జయవర్ధనే ట్విట్టర్‌లో స్పందించాడు. ‘ఎన్నికలొస్తే చాలు... ఇలాంటి సర్కస్ చేష్టలకు కొదవుండదు. మరి ఫిక్సర్ల పేర్లు, ఆధారాలు చూపాలిగా’ అని చురకలంటించాడు. ఆ ఫైనల్లో అతను సెంచరీ సాధించాడు. అప్పటి సారథి సంగక్కర సాక్ష్యాధారాలు చూపాలని డిమాండ్ చేశాడు. ‘మాజీ మంత్రి వద్ద ఉన్న ఆధారాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి, అవినీతి నిరోధక విభాగానికి సమర్పిస్తే విచారణ చేపట్టేందుకు వీలవుతుంది’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment