ఇంగ్లండ్‌లో క్రికెట్ సీజన్ భారత్‌కు అనుకూలంగా మారిపోతుందనుకున్న దశలో కుర్రాడు స్యామ్ కరన్ నేతృత్వంలో ఆ జట్టు పేసర్లు ఒక్కసారిగా ఆశలు కూల్చేశారు. తొలి టెస్టును ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో గెలుచుకొని ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగిందంటే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్ వల్లనే. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ను ఒక వైపు కాపాడుకుంటూ మరో వైపు పరుగులు చేస్తూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని కేవలం 13 పరుగులకే పరిమితం చేయడం కన్నార్పకుండా చూడగలిగిన ప్రదర్శన. ఇతరులతో పోలిస్తే పరిస్థితికి తగినట్లుగా మానసికంగా సిద్ధం కావడం గొప్ప ఆటగాళ్ల లక్షణం. కోహ్లి తాను ఎదుర్కొన్న ప్రతీ బంతి ద్వారా దానిని నిజం చేసి చూపించాడు.
ఆరంభంలో బంతి విపరీతంగా స్వింగ్ అవుతున్న సమయంలో పట్టుదలగా ఆడిన కోహ్లి ఆ ఉత్కంఠ క్షణాలను అధిగమించాడు. తన బ్యాక్ లిఫ్ట్‌లు మార్పు చేసి, బ్యాట్ వేగాన్ని తగ్గించి అతను ఫలితం సాధించాడు. ఆ తర్వాత తనదైన శైలిలో చక్కటి షాట్లతో చెలరేగిపోయాడు. దురదృష్టవశాత్తూ ఇతర ఆటగాళ్లు మాత్రం మానసికంగా సన్నద్ధం కాలేకపోయారు. ధావన్‌ను రెండో టెస్టునుంచి తప్పిస్తారనే వార్తలు వినిపించాయి. అది నిజమైతే మాత్రం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. జట్టు ఎప్పుడు ఓడిపోయినా అందరికంటే ముందు అతనిపైనే వేటు పడుతూ వస్తోంది. ఓడిన మ్యాచ్‌లలో సహచరులకంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాల్లో కూడా ధావన్‌పైనే వేటు వేశారు. అతనిపై అంత అపనమ్మకం ఉంటే అసలు విదేశీ పర్యటనల్లో ఎంపిక చేయడమెందుకు? దీనికి ధావన్ తనను తాను నిందించుకోవాలి. చక్కగా ఆడుతున్న సమయంలో కూడా అనవసరంగా వికెట్ పారేసుకునే తత్వం అతనిది. కనీసం డబుల్ సెంచరీలాంటి ఇన్నింగ్స్ ఆడితే అతనిపై టీమ్ మేనేజ్‌మెంట్‌కు నమ్మకం పెరిగి ఇతరులలాగే అదనపు అవకాశాలు ఇస్తారు కదా.
పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంలా నిలిస్తే తప్ప ఈ సిరీస్‌లో తక్కువ స్కోర్లు నమోదు కాబోతున్నాయని తొలి టెస్టు రుజువు చేసింది. కాబట్టి అదనపు బ్యాట్స్‌మన్‌తో ఆడటం జట్టుకు ఉపయోగకరం. పుజారాకు అవకాశం ఉంది కానీ కార్తీక్, అశ్విన్, పాండ్యా కూడా స్వింగ్ అవుతు న్న బంతిని ఆడలేకపోతున్నారు కాబట్టి ఆరో బ్యాట్స్‌మన్ పనికొస్తాడు. అయితే పుజారాను తీసుకురావాలంటే ఒక నమ్మకమైన ఆటగాడిని తప్పించాల్సి వస్తుంది. అది మాటల్లో చెప్పినంత సులువు కాదు.
Comments
Please login to add a commentAdd a comment