నిలవాలంటే...గెలవాలి | Do Or Die Match For Indian Football Team With Oman Football Team | Sakshi
Sakshi News home page

నిలవాలంటే...గెలవాలి

Published Tue, Nov 19 2019 4:14 AM | Last Updated on Tue, Nov 19 2019 4:14 AM

Do Or Die Match For Indian Football Team With Oman Football Team - Sakshi

మస్కట్‌: ఒమన్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి భారత ఫుట్‌బాల్‌ జట్టు సిద్ధమైంది. 2022 ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌కు అర్హత రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ విజయం తప్పనిసరి. ఒకవేళ ఓడిందంటే మాత్రం ప్రపంచ కప్‌ దారులు మూసుకుపోయినట్లే. 2022 ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా నేడు గ్రూప్‌ ‘ఇ’లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఇప్పటికే భారత్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక దాంట్లో ఓడి... మూడింటిని ‘డ్రా’ చేసుకున్న భారత్‌... 3 పాయింట్లతో గ్రూప్‌లో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఒమన్‌ మాత్రం నాలుగింటిలో మూడు గెలిచి 9 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. క్వాలిఫయర్స్‌ తొలి అంచె పోటీల్లో ఇరు జట్లు గువాహటి వేదికగా తలపడగా భారత్‌ 1–2తో ఓటమి చవిచూసింది. ఆ మ్యాచ్‌లో 80 నిమిషాల పాటు ఆధిక్యం కనబరిచిన భారత్‌... చివరి 10 నిమిషాల్లో చేతులెత్తేసి ఏకంగా రెండు గోల్స్‌ ప్రత్యర్థికి సమర్పించుకొని పరాభవాన్ని మూటగట్టుకుంది.

అనంతరం ఆసియా చాంపియన్‌ ఖతర్‌తో జరిగిన మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించిన భారత్‌ ఆ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అయితే విజయాలు ఖాయం అనుకున్న బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న భారత్‌ ప్రస్తుతం చావో రేవో పరిస్థితి తెచ్చుకుంది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లోనూ సారథి సునీల్‌ చెత్రి ఎటువంటి ప్రభావం చూపలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించడం అంత సులభం కాదు. ఇప్పటివరకు ఇరు జట్లు 11 సార్లు తలపడగా... భారత్‌ ఎనిమిదింట ఓడి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. ఒమన్‌కు పోటీ ఇవ్వాలంటే భారత్‌ అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిఫెన్స్‌ విషయంలో మెరుగవ్వాలి. అయితే కీలక ఆటగాళ్లు గాయాలతో మ్యాచ్‌కు దూరమవ్వడం భారత్‌కు ప్రతికూలాంశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement