యువ తరంగం! | Dream call-up for Bhagath Verma to play Under-19 in England | Sakshi
Sakshi News home page

యువ తరంగం!

Published Sun, Jul 2 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

యువ తరంగం!

యువ తరంగం!

భారత అండర్‌–19 జట్టులో భగత్‌ వర్మ
నిలకడగా రాణిస్తోన్న హైదరాబాద్‌ ఆఫ్‌ స్పిన్నర్‌
ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక  


సాక్షి, హైదరాబాద్‌: కొంతకాలంగా జాతీయ క్రికెట్‌ జట్టులో హైదరాబాద్‌ ఆటగాళ్ల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కానీ ఈ ఏడాది హైదరాబాద్‌ క్రికెట్‌కు అంతా మంచే జరుగుతోంది. ఐపీఎల్‌–10 సీజన్‌లో విశేషంగా రాణించిన పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ దక్షిణాఫ్రికాలో జరిగే ముక్కోణపు వన్డే టోర్నీ, అనధికారిక టెస్టు సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టులోకి ఎంపికవ్వగా... తాజాగా ఇంగ్లండ్‌లో పర్యటించే భారత అండర్‌–19 జట్టులో హైదరాబాద్‌కే చెందిన ఆఫ్‌ స్పిన్నర్‌ భగత్‌ వర్మకు స్థానం లభించింది.

ఈ నెలలో ఇంగ్లండ్‌తో భారత్‌ నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడనుంది. ఏడాది కాలంగా జాతీయస్థాయిలో నిలకడగా రాణించిన ఫలితం ఎట్టకేలకు భగత్‌ వర్మకు దక్కింది. తనకు లభించిన ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని... వచ్చే ఏడాది జరిగే అండర్‌–19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులోనూ స్థానాన్ని సొంతం చేసుకుంటానని ‘సాక్షి’తో భగత్‌ వర్మ చెప్పాడు. తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించిన భగత్‌ వర్మ అభిప్రాయాలు అతని మాటల్లోనే...

సరదాగా మొదలుపెట్టి...
ఐదేళ్ల వయసులో క్రికెట్‌లో అడుగుపెట్టాను. సికింద్రాబాద్‌లో ఇంటికి సమీపంలోని మహబూబ్‌ కాలేజీలో కోచ్‌ మొహమ్మద్‌ ఇక్బాల్‌ అకాడమీ ఉంది. సరదాగా అక్కడి వెళ్లిన సమయంలో క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. అప్పటి నుంచి ఆయన వద్ద శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆయన వద్దే ప్రాక్టీస్‌ చేస్తున్నా. చిన్న తనంలోనే నాన్న చనిపోవడంతో అమ్మ ఉమ అన్నీ తానై నన్ను ముందుకు నడిపించారు. నేను ఈ స్థాయికి చేరుకోవడంలో అమ్మ పాత్ర ఎంతో ఉంది. కోచ్‌ ఇక్బాల్‌ ప్రోత్సాహం మరవలేనిది. కీలక సమయంలో భారతి సిమెంట్స్‌ నుంచి స్పాన్సర్‌షిప్‌ లభించడంతో పూర్తి ఏకాగ్రతతో కెరీర్‌పై దృష్టి సారించాను.  

శ్రమకు తగ్గ ఫలితం...
హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహించే లీగ్స్‌లో మూడేళ్లుగా నేను ఆర్‌.దయానంద్‌ ఎలెవన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. గత ఏడాది కూచ్‌ బెహర్‌ అండర్‌–19 ట్రోఫీ జాతీయ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీసుకున్నాను. ఈ ప్రదర్శనే నాకు జాతీయ జట్టులో స్థానం లభించేందుకు దోహదపడింది. స్కూల్, జూనియర్‌ కాలేజీ స్థాయిలో సెయింట్‌ ఆండ్రూస్, సెయింట్‌ జాన్స్‌ జట్ల తరఫున ఆడాను. ఈ సందర్భంగా హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్‌ మనోజ్‌ ఎంతగానో ప్రోత్సహించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. భారత అండర్‌–19 జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆధ్వర్యంలో శిక్షణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. క్రికెట్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన ఆటను అభిమానించాను. ఈ ఏడాది హెచ్‌సీఏ ఎ–1 డివిజన్‌ లీగ్స్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాను. పది వికెట్లు తీయడంతోపాటు ఒక అర్ధ సెంచరీ చేశాను.

అవకాశం వదులుకోను...
స్వతహాగా నేను ఆఫ్‌ స్పిన్నర్‌ను. బ్యాటింగ్‌ కూడా బాగా చేయగలను. ఇంగ్లండ్‌ పర్యటనలో జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ తరఫున నాకు తుది జట్టులో ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. దొరికిన అవకాశాన్ని వృథా కానివ్వను. నా ప్రదర్శనతో ఆకట్టుకునేందుకు కృషి చేస్తాను. నా తదుపరి లక్ష్యం వచ్చే ఏడాది జనవరి–ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరిగే అండర్‌–19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో ఎంపికవ్వడం. ఇక భారత సీనియర్‌ జట్టుకు ఆడటం నా జీవితాశయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement