
Wriddhiman Saha: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా తాను టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమని రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్షన్ కమిటీ సభ్యుడొకరు ఇదివరకే తనతో స్పష్టం చేశారని, నేనే ఆటపై మమకారం చంపుకోలేక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తనను ఎంపిక చేస్తారని ఆశగా ఎదురుచూశానని వైరాగ్యంతో చెప్పుకొచ్చాడు.
గడిచిన ఐపీఎల్ సీజన్‌లో తన పర్ఫామెన్స్‌ను కొలమానంగా తీసుకుని ఉంటే ఈ పాటికి టీమిండియాతో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఉండాల్సి ఉండిందని బాధను వెల్లగక్కాడు. యువకులతో పోటీపడి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా అవకాశం రాలేదంటే ఇక తాను టీమిండియాకు ఆటడం కష్టమేనని వాపోయాడు.
కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటూ వచ్చిన సాహా, గతేడాది ఆడిలైడ్ టెస్టు తర్వాత వెనకబడ్డాడు. నాటి ఆస్ట్రేలియా సిరీస్‌లో రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగి టెస్టుల్లో టీమిండియా ప్రధాన వికెట్ కీపర్‌గా మారాడు. తదనంతరం సాహా, టీమిండియాకు సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్‌గా మారిపోయాడు. పంత్ గాయం కారణంగా లేక విశ్రాంతి తీసుకున్న మ్యాచుల్లోనే సాహాకు అవకాశం దొరికేది.
ఇలాంటి పరస్థితుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి నిమిషంలో గుజరాత్ టైటాన్స్‌లో భాగమైన సాహా తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని 11 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీల సాయంతో 31.70 సగటున 317 పరుగులు చేశాడు. ఇదే ప్రదర్శన ఆధారంగా తనను టీమిండియాకు ఎంపిక చేస్తారని సాహా ఆతృతగా ఎదురుచూశాడు. అయితే సెలెక్టర్లు మాత్రం అతనికి మరోసారి మొండి చేయి చూపించారు.
చదవండి: త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..!