దక్షిణాఫ్రికా దుమ్ము రేపింది. ఇద్దరే ఇద్దరు బ్యాట్స్మన్ భారత్ చేతిదాకా వచ్చిన విజయాన్ని లాగేసుకున్నారు. చిట్ట చివరి రోజు వీరవిహారం చేసి భారత బౌలర్లను చీల్చి చెండాడి మరీ దూసుకెళ్తున్నారు. డుప్లెసిస్, డివీలియర్స్ ఇద్దరూ రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు విజయం దిశగా జోరుగా పరుగులు పెడుతోంది. చివరి రోజు మ్యాచ్ ప్రారంభం అయిన తర్వాత కేవలం మూడు వికెట్లను మాత్రమే భారత బౌలర్లు పడగొట్టగలిగారు. స్పిన్నర్లు వచ్చినా, పేసర్లు నిప్పులు చెరిగే బంతులు విసిరినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదు. ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండా.. కేవలం ఫోర్లు, సింగిల్స్, రెండేసి పరుగులతోనే దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ విజృంభించారు.
డుప్లెసిస్ ఎక్కువగా సింగిల్స్, రెండేసి పరుగులు తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. వెటరన్ బ్యాట్స్మన్ కలిస్ను భారత వెటరన్ బౌలర్ జహీర్ ఖాన్ ఎల్బీడబ్ల్యు రూపంలో వెనక్కి పంపించి 300 వికెట్ల క్లబ్బులో చేరాడన్న ఆనందం కాస్తా డుప్లెసిస్, డివీలియర్స్ వీర విజృంభణతో ఆవిరైపోయింది. ఇద్దరూ సెంచరీలతో విజృంభించడంతో భారత బౌలర్లు నీరసపడ్డారు. కడపటి వార్తలు అందేసరికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. చివర్లో డివీలియర్స్ ను ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత అభిమానుల్లో కాస్త ఊరట కనిపించింది. వెంటనే షమీ బౌలింగ్ లో డుమిని అవుట్ కావడంతో ఆసక్తి పెరిగింది. డుప్లెసిస్ 123 పరుగులతో క్రీజ్ లో ఉండగా, డివీలియర్స్ 12 ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.