భువనేశ్వర్ : తన స్నేహితురాలితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ సంచలన ప్రకటన చేశారు. తద్వారా స్వలింగ సంపర్కురాలిననే విషయాన్ని బయటపెట్టిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచారు. ఒడిశాలోని తన సొంత గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో జీవితాన్ని పంచుకోబోతున్నట్టు పేర్కొన్న ద్యుతీ.. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి ఆమె పూర్తి వివరాలు వెల్లడించలేనన్నారు.
ఈ విషయం గురించి ద్యుతి మాట్లాడుతూ.. ‘ నా సోల్‌మేట్‌ను కనుగొన్నాను. తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే, వారితో జీవితాన్ని పంచుకునే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. స్వలింగ సంపర్కుల హక్కులు కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. ప్రేమను తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది(సెక్షన్ 377ను ఉద్దేశించి). అథ్లెట్‌ను అయినంత మాత్రాన నా నిర్ణయాన్ని ఎవరూ జడ్జ్ చేయాల్సిన పనిలేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అంశం. అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా. గత పదేళ్లుగా స్ప్రింటర్‌గా భారత్‌కు ఎన్నో విజయాలు అందించాను. మరో ఐదేళ్ల దాకా రాణిస్తాననే నమ్మకం ఉంది. నా క్రీడా ప్రయాణానికి సహకరిస్తూ.. జీవితాంతం తోడుండే వ్యక్తిని ఎంచుకున్నా. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్‌షిప్, ఒలంపిక్ క్రీడలపైన దృష్టి సారించాను. ఆటల నుంచి విరామం తీసుకున్న తర్వాత పూర్తి సమయం తనకే కేటాయించి.. జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని పేర్కొంది.
కాగా పేదరికాన్ని జయించి ‘ట్రాక్’ బాట పట్టిన ద్యుతిలో పురుషత్వ లక్షణాలున్నాయని నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా కలత చెందిన ఈ ఒడిషా అథ్లెట్ ఆర్బిట్రేషన్ కోర్టులో పోరాడి గెలిచింది. ఇక గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజతాలు నెగ్గిన సంగతి తెలిసిందే.
సెక్షన్ 377..సంచలన తీర్పు
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సెక్షన్ 377పై గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సమానత్వపు హక్కును హరిస్తున్న ఈ సెక్షన్‌లోని పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మైనార్టీ తీరిన ఇద్దరు పరస్పర అంగీకారంతో ప్రైవేటు ప్రదేశంలో స్వలింగ శృంగారంలో పాల్గొనడం ఇకపై ఏమాత్రం నేరం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘స్వలింగ సంపర్కం హేతుబద్ధం కాదని, సమర్థించలేమని, నిరంకుశమని ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు చెబుతున్నాయి. అయితే బ్రిటీష్ కాలంనాటి 158 ఏళ్ల నాటి ఈ నిబంధన సరికాదు. సమాజంలో ఎల్‌జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 సమాజంలో వేళ్లూనుకుపోయిన పాతతరం ఆలోచనలకు ప్రతిరూపమని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment