కింగ్‌స్టన్: నల్ల జాతీయుల పట్ల ఇప్పటి వరకు జరిగింది చాలని, ఇక నుంచైనా వారిని అందరితో సమానంగా గౌరవించాలని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో అన్నాడు. ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతోన్న నల్ల జాతీయులు ప్రతీకారం కోసం చూడట్లేదని, సమానత్వాన్ని కోరుకుంటున్నారని బ్రేవో పేర్కొన్నాడు. ‘వర్ణ వివక్ష విచారకరం. ఎన్నో ఏళ్లుగా జరుగుతోన్న అఘాయిత్యాల గురించి నల్ల జాతీయునిగా నాకు బాగా తెలుసు. కానీ వాటికి ప్రతీకారం కోరుకోవట్లేదు. మాకు కావల్సిందల్లా సమానత్వం, గౌరవం అంతే’ అని జింబాబ్వే మాజీ క్రికెటర్ పోమీ ఎంబాగ్వాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా బ్రేవో వ్యాఖ్యానించాడు. విండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 71 టి20లు ఆడిన 36 ఏళ్ల బ్రేవో... నల్ల జాతీయులు కూడా మిగతా వారిలాగే శక్తివంతమైన, అందమైన వారని ప్రపంచం గుర్తించాలని కోరాడు. ‘సోదర సోదరీమణులను నేను కోరేదొక్కటే. నెల్సన్ మండేలా, మొహమ్మద్ అలీ, మైకేల్ జోర్డాన్ లాంటి గొప్ప వ్యక్తులు మాలోని వారే. మేం కూడా శక్తివంతులమనే విషయాన్ని ప్రపంచం గుర్తించాలి’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment