భారత్‌లో జరిగే తొలి డేనైట్ టెస్టుకు ముందు జరుగుతోన్న పింక్ సందడి అంతాఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే ఈడెన్ గార్డెన్స్ వేదికనే గులాబీ రేకులతో పరిచేసినట్టుగా ఉందీమాయ. ఇది కొత్తేమీ కాదు. ఈపాటికే ప్రపంచం (మిగతా జట్లు) ఆడిన ఆటే! అయితే అప్పుడు చడీచప్పుడులేదు. కానీ ఇప్పుడు... భారత్ ఆడుతోందంటే మాత్రం ప్రపంచమే ఆడినంత సంబరంగా ఉంది. మన జాతీయ పతాకం మువ్వన్నెలతో మురిసిపోయినట్లుగా మన టెస్టు గులాబీ వన్నెలద్దుకుంటున్న వేళ వచ్చేసింది.
భారత్ ‘పింక్’ హుషార్‌లో ఉంది. క్రికెట్ అభిమానులంతా డే నైట్ టెస్టుపై ఎనలేని ఆసక్తి పెంచుకున్నారు. ఈ మ్యాచ్ ఆడే క్రికెటర్లే కాదు మాజీలు, దిగ్గజాలు సైతం పింక్ బాల్ టెస్టుపైనే చర్చించుకుంటున్నారు. వ్యాఖ్యాతలు కూడా ఈ మ్యాచ్ గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. ఇక భారత గడ్డపై కొంగొత్త ఆటకు వేదికైన కోల్‌కతా మాత్రం గులాబీమయమైంది. ఈడెన్ గార్డెన్స్ పింక్ షో చూపించేందుకు కొత్త సొబగులు అద్దుకుంది.
రహానే కళ్లలో గులాబీ కలలే..
భారత్‌లో చారిత్రక డేనైట్ టెస్టుపై కలలు కంటున్నానని వైస్ కెప్టెన్ రహానే చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి అతను జత చేసిన ఫొటో తెగ వైరల్ అయ్యింది. లైక్‌ల మీద లైక్‌లు పోటెత్తుతున్నాయి. తన తలగడ వద్ద గులాబీ బంతిని పెట్టుకొని నిద్రిస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో పెట్టిన రహానే ‘ఇప్పటికే ఆ టెస్టు కలల్లో మునిగిపోయాను’ అని ట్వీట్ చేశాడు. ఇది ఆ టెస్టు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య ను అమాంతం పెంచేసింది. సోషల్ మీడి యాలో ‘పింక్’ ఫీవర్ ఎక్కించిన రహానేను భారత కెప్టెన్ కోహ్లి అనుసరించాడు. ‘నైస్ పోజ్ జింక్స్’ అంటూ ట్వీటాడు. కలల్లో మునిగిపోయిన ఫొటో తనకు బాగా నచ్చిందంటూ స్పందించాడు. అతనికి ఓపెనర్ ధావన్ కూడా జత కలిశాడు. ‘ఆ కలలోనే ఫొటో దిగావా ఏంటీ’ అని పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు.
పింక్ టీ షర్ట్‌లతో స్వాగతం
కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో భారత ఆటగాళ్ల కోసం ఆతృతగా ఎదురుచూసిన అభిమానులు పింక్ టీ షర్ట్‌లతో స్వాగతం పలికారు. దీంతో ఎయిర్‌పోర్ట్ గులాబీ టీషర్ట్‌లతో సందడి సందడిగా మారింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే విమానంలో వచ్చారు. మంగళవారం భారత కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానే ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఇలాంటి వాతావరణం ఎదురైంది. ఆటగాళ్లంతా అక్కడి నుంచి బస చేసే హోటల్ గదులకు వెళ్లిపోయారు. భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బంగ్లా కోచ్ రసెల్ డొమింగోలు ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను పరిశీలించేందుకు వెళ్తారని బోర్డు మీడియా మేనేజర్ వెల్లడించారు. స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, పేసర్లు షమీ, ఉమేశ్‌లు బుధవారం జట్టుతో కలుస్తారని ఆయన తెలిపారు. మంగళవారం ఆటగాళ్లెవరూ ప్రాక్టీస్ చేయలేదు. హోటల్ గదులకే పరిమితమయ్యారు.
సౌకర్యాలు మెరుగుపరిస్తే...
భారత్‌లో టెస్టు క్రికెట్ బతికేందుకు కొత్త తరహా డే నైట్ టెస్టులతో పాటు మైదానానికి వచ్చే ప్రేక్షకులకు కనీస సౌకర్యాల్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతో ఉందని దిగ్గజ బ్యాట్స్‌మన్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ‘ఏదో పింక్ బాల్ టెస్టుతో జనం ఎగబడతారనుకుంటే పొరపాటు. వాళ్లకు సౌకర్యాలు కల్పించాలి. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, మంచి సీట్లు, కార్లకు పార్కింగ్ లాంటి అవసరాల్ని తీర్చాలి. అలాగే కచ్చితమైన టెస్టు క్యాలెండర్‌ను అమలు చేయాలి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో టెస్టులను ఆదరించేందుకు ఎన్నో కారణాలున్నాయి. బాక్సింగ్ డే టెస్టు, కచ్చితంగా జూలైలో లార్డ్స్ టెస్టు ఇలాంటివన్నీ పక్కా ప్రణాళికతో జరిగేవి. అందుకే యాషెస్ సిరీస్ ఇప్పటికీ ప్రభ కోల్పోకుండా విరాజిల్లుతోంది. భారత్‌లో కూడా కచ్చితమైన టెస్టు క్యాలెండర్‌ను జతచేస్తే ప్రయోజనం ఉంటుంది’ అని ద్రవిడ్ వివరించాడు. ఒకప్పుడు ఈడెన్‌లో లక్ష మంది మ్యాచ్ చూసేవారని ఇప్పుడా పరిస్థితి లేదన్నాడు. అలాగే డిజిటల్ మీడియా, హెచ్‌డీ టీవీల రాకతో మైదానానికి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పాడు.
పింక్ బాల్‌కు వారం పడుతుంది
పింక్ బాల్ తయారయ్యేందుకు ఏడెనిమిది రోజుల సమయం పడుతుంది. దీని కోసం ప్రత్యేకించి గులాబీ రంగు వేసిన లెదర్‌ను వినియోగిస్తారు. ఇది హార్డ్‌గా మారకుండా సాఫ్ట్‌గా ఉండేలా చూస్తారు. రెండు సగం కప్పులు తయారయ్యాక దాన్ని ఒక గోళాకారంగా చేతితో కుట్లు వేస్తారు. అనంతరం మళ్లీ గులాబీ రంగు వేస్తారు. ఇది రివర్స్ స్వింగ్‌కు అనుకూలిస్తుందని, షమీ లాంటి బౌలర్‌కు ఆయుధంగా మారుతుందని భారత వర్గాలు భావిస్తున్నాయి.
టికెట్లు హాట్ కేకుల్లా...
చారిత్రక డేనైట్ టెస్టు చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తనున్నారు. ఐదు రోజుల మ్యాచ్‌లో మొదటి నాలుగు రోజుల టికెట్లన్నీ అయిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. పింక్ బాల్ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారని చెప్పారు. ‘నాలుగు రోజుల టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ స్థాయిలో విక్రయం జరగడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. 67 వేల సీట్ల సామర్థ్యమున్న ఈడెన్ గార్డెన్స్‌లో ఈ నెల 22 నుంచి డేనైట్ టెస్టు జరుగుతుంది
Comments
Please login to add a commentAdd a comment