
ఇంగ్లండ్ 247/4
లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఐదో టెస్టులో ఇంగ్లండ్ దీటుగా జవాబిస్తోంది. రూట్ (68), పీటర్సన్ (50) అర్ధసెంచరీలు నమోదు చేయడంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 4 వికెట్లకు 247 పరుగులు చేసింది.
ఇయాన్ బెల్ (29 నాటౌట్), వోక్స్ (15 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఇంకా 245 పరుగులు వెనకబడి ఉంది. 32/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఆరంభంలోనే కుక్ (25) వికెట్ కోల్పోయింది. అయితే రూట్ నెమ్మదిగా ఆడుతూ రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
కుక్‌తో కలిసి తొలి వికెట్‌కు 68, రెండో వికెట్‌కు ట్రాట్ (40)తో కలిసి 50 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. తర్వాత వచ్చిన పీటర్సన్ వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చినా... ట్రాట్‌కు మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. తర్వాత బెల్ కూడా నిలకడను కనబర్చడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఈ క్రమంలో పీటర్సన్ 127 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక... స్టార్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో వోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. స్టార్క్ 2, హారిస్, లియోన్ చెరో వికెట్ తీశారు.