
హేల్స్ సూపర్ సెంచరీ:ఇంగ్లండ్ ఘన విజయం
చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో మరో ఆసక్తి పోరుకు తెరలేచింది. శ్రీలంకతో గురువారం ఇక్కడ జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఇంగ్లండ్ సూపర్ ఫాంను కొనసాగించి లంకేయులకు షాకిచ్చింది. శ్రీలంక విసిరిన 190 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఇంకా నాలుగు బంతులుండగానే ఛేదించింది. తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయి తడబడిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు హేల్స్ అబేధ్యమైన సెంచరీతో జట్టు గెలుపును సునాయాసం చేశాడు. ఆదిలో లంబ్ (0), ఆలీ(0), వికెట్లు కోల్పోయినా, హేల్స్ మాత్రం లంకేయులకు చుక్కలు చూపించాడు. ఓపెనర్ గా వచ్చిన హేల్స్(116) పరుగులతో చివరి వరకూ క్రీజ్ లో ఉండి ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతనికి మోర్గాన్ (57) పరుగులతో చక్కటి సహకారం అందించడంతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో కులశేఖర నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన లంకేయులకు ఆదిలోనే పెరీరా(3) ను వికెట్టును చేజార్చుకుని కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ దిల్షాన్ కు జయవర్దనే జత కలవడంతో జట్టు స్కోరు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఇరువురూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. దిల్షాన్ (55), జయవర్దనే(89) పరుగులతో ఆకట్టుకుని శ్రీలంకకు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చివరిలో తిషారా పెరీరా(23) బాధ్యతగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్, డెర్న్ బ్యాచ్ చెరో రెండు వికెట్లు లభించాయి.