ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు జరిమానా
కటక్: భారత్తో జరిగిన వన్డే సిరీస్ను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్తో నగరంలోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ఇంగ్లండ్ జట్టుకు జరిమానా పడింది. ఇంగ్లండ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాను విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. మరొకవైపు స్లో ఓవర్ రేట్ కారణమైన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ మేరకు ఇంగ్లండ్ కు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
రెండో వన్డేలో భారత్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన మ్యాచ్లో భారత్ నే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 366 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.