
కబడ్డీ ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు
మరికొన్ని రోజుల్లో సాకర్ సమరం ఫీఫా వరల్డ్ కప్-2018 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆతిథ్య దేశం రష్యాకు చేరుకున్న జట్లు.. సాధనలో మునిగిపోయాయి. ఇంగ్లాండ్ జట్టు మేనేజర్ గరేత్ సౌత్‌గేట్ తన బృందంతో సాధన చేయిస్తున్నారు. అయితే ఇంతలో ఊహించని సన్నివేశం దర్శనమిచ్చింది. ఆటగాళ్లు ఉన్నపళంగా మొత్తం ఆటనే మార్చేశారు.
బంతిని పక్కన పెట్టి కాసేపు కబడ్డీతో సందడి చేశారు. జట్టు ఆటగాళ్లు హ్యారీ కేన్, డానీ వెల్‌బెక్, గేరీ కచిల్, జెస్సే లింగార్డ్ తదితరులు కలిసి మైదానంలో కబడ్డీ ఆడారు. ‘మానసిక ఒత్తిడి అధిగమించడానికి కబడ్డీ ఓ మంచి సాధనం. అందుకే మా ఆటగాళ్లను కబడ్డీ ఆడమని ప్రోత్సహిస్తున్నాం’ అని సౌత్‌గేట్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రికెటర్లు ప్రాక్టీస్ సమయంలో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించిన దృశ్యాలు అనేకం. ధోనీ, కోహ్లి లాంటి చాలా మంది ఆటగాళ్లు కూడా సాకర్‌కు వీరాభిమానులే. కానీ సాకర్ ప్లేయర్లు మాత్రం ఇలా కబడ్డీపై పడిపోవటం మాత్రం అరుదైన విషయమే.
ఇదిలా ఉండగా జూన్ 14న ఫీఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. గ్రూప్-జీ జాబితాలో ట్యూనీషియా, బెల్జియం, పనామాతోపాటు ఇంగ్లాండ్ జట్టు కూడా ఉంది. జూన్ 18న వోల్వోగార్డ్‌లో ట్యూనీషియాతో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment