ఇంగ్లండ్‌ను ఆపతరమా!
►అద్భుత ఫామ్‌లో మోర్గాన్ సేన
►సొంతగడ్డపై టైటిల్ సాధించడమే లక్ష్యం
►చాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు ఫైనల్‌కు
339, 328, 328, 296, 321, 350, 309, 302, 444, 324... ముందుగా బ్యాటింగ్ చేసిన గత పది వన్డేల్లో ఇంగ్లండ్ జట్టు సాధించిన స్కోర్లు ఇవి. అంటే సగటున ప్రతీ మ్యాచ్‌కు ఆ జట్టు 334 పరుగులు చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సాంప్రదాయ టెస్టులు మినహా వన్డేల్లో ఈ టీమ్ అసలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే గత రెండేళ్లలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. స్పెషలిస్ట్ ఆటగాళ్లతో ప్రపంచంలో ఏ వేదికలోనైనా వన్డేల్లో భారీ స్కోర్లు సాధిస్తున్న ఇంగ్లండ్ బలమైన జట్టుగా ఎదిగింది. తమ వన్డే చరిత్రలో అత్యుత్తమ దశలో ఉన్న ఇంగ్లండ్... సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఇంగ్లండ్‌లోనే జరిగిన రెండు చాంపియన్స్ ట్రోఫీల్లోనూ
ఫైనల్లో ఓడిన ఆ జట్టు ఈసారి మాత్రం చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది.
సాక్షి క్రీడా విభాగం
ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు తాజా ఫామ్ ఏ ప్రత్యర్థికైనా దడ పుట్టించేలా ఉంది. దక్షిణాఫ్రికాలాంటి బలమైన ప్రత్యర్థితో బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు సాధించిన అలవోక విజయం దానిని మళ్లీ నిరూపించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యం గల ఆటగాళ్లతో పాటు సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండటం ఆ జట్టుకు అదనంగా అనుకూలించే అంశం. ముఖ్యంగా మోర్గాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాక వన్డే టీమ్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. ఏకంగా తొమ్మిదో స్థానం వరకు ఎలాంటి తత్తరపాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగల లైనప్ ఇంగ్లండ్ సొంతం. తమకు అనుకూలించే వాతావరణ పరిస్థితుల్లో స్వింగ్‌తో చెలరేగిపోగల బౌలర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. ఇవన్నీ ఇతర జట్లకంటే ఆతిథ్య జట్టును అందరికంటే ముందు నిలబెడుతున్నాయి.
గత రికార్డు...
చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ రెండు సార్లు ఫైనల్ చేరింది. 2004లో వెస్టిండీస్ చేతిలో ఆ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. 217 పరుగులు చేసిన ఇంగ్లండ్.. విండీస్‌ను 147/8 వద్ద కట్టడి చేసి విజయాన్ని ఆశించింది. కానీ విండీస్ బ్యాట్స్‌మెన్ బ్రౌన్, బ్రాడ్‌షా 71 పరుగులు జోడించి ఇంగ్లండ్ కథ ముగించారు. గత టోర్నీలో భారత్ చేతిలోనే ఇంగ్లండ్‌కు ఓటమి ఎదురైంది. ఈ 20 ఓవర్ల మ్యాచ్‌లో కూడా ఆ జట్టు విజయానికి చేరువగా వచ్చింది. చేతిలో ఆరు వికెట్లతో 16 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి ఇంగ్లండ్ ఓటమి దిశగా నడిచింది. ఓవరాల్‌గా చాంపియన్స్ ట్రోఫీలో 21 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ టీమ్ 11 గెలిచి, 10 మ్యాచ్‌లలో ఓడింది.
అంతా స్టార్లే...
ఓపెనర్లు జేసన్ రాయ్, హేల్స్ జోడి ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారిస్తోంది. ప్రతీసారి వీరు అందిస్తున్న శుభారంభమే ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేస్తోంది. నిలకడకు మారు పేరైన జో రూట్‌తో పాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్‌లతో జట్టు మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా స్టోక్స్ ఆల్‌రౌండ్ నైపుణ్యం ఇంగ్లండ్ జట్టుకు వరంలా మారింది. ప్రపంచంలోనే ఇప్పుడు మేటి ఆల్‌రౌండర్‌గా ఉన్న స్టోక్స్, ఇటీవల ఐపీఎల్‌లో ప్రదర్శించిన ఫామ్‌ను కొనసాగిస్తే ఇతర జట్లకు కష్టాలు తప్పవు. మోకాలి గాయం నుంచి కోలుకొని అతను పూర్తి ఫిట్‌గా మారడం ఆ జట్టు ఆందోళనను దూరం చేసింది. మొయిన్ అలీ కూడా ఆల్‌రౌండర్‌గా చెలరేగిపోతున్నాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై వోక్స్, వుడ్, ప్లంకెట్‌లాంటి పేసర్లు సరిగ్గా సరిపోతారు.
అంతా అనుకూలం...
లీగ్ దశలో జూన్ 1న జరిగే టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్‌కు మంచి విజయావకాశాలు ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడాల్సి ఉన్నా... ఇంగ్లండ్ గడ్డపై ఇటీవల ఆస్ట్రేలియాకు రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు కాబట్టి మోర్గాన్ సేన సెమీస్ అడుగు ఖాయంగా వేసినట్లే.
ఇంగ్లండ్ జట్టు వివరాలు: మోర్గాన్ (కెప్టెన్), బెయిర్‌స్టో, బిల్లింగ్స్, హేల్స్, రషీద్, జేసన్ రాయ్, విల్లీ, మార్క్ వుడ్, మొయిన్ అలీ, జేక్ బాల్, బట్లర్ (వికెట్ కీపర్), ప్లంకెట్, రూట్, స్టోక్స్, వోక్స్.
ఇంగ్లండ్ జట్టు మంచి సమతూకంతో ఉంది. 9–10 స్థానాల వరకు బ్యాటింగ్ చేయగలవారు ఆ జట్టులో ఉన్నారు. కనీసం ఐదుగురు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల సమర్థులు. వారిపై గెలవడం అంత సులువు కాదని మాకు భారత్‌లోనే అర్థమైంది. ఇంగ్లండ్‌ను ఓడించడం ప్రతీ జట్టుకు సవాలే. గత రెండేళ్లలో వారి క్రికెట్ చాలా మారిపోయింది. కొడితే కనీసం 330 పరుగులు కొడుతున్నారు. జట్టుగా మెరుగు కావడంలో వారి పట్టుదలను అభినందించక తప్పదు. ఏ దశలోనూ ఓటమిని అంగీకరించని విధంగామానసికంగా కూడా జట్టు చాలా ఎదిగింది. దూకుడైన ఆటతో ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక సొంతగడ్డపై వారిని ఎదుర్కోవడం చాలా కష్టం.
– ఇంగ్లండ్ జట్టు గురించి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య