
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 312 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టులో జేసన్ రాయ్(54: 53 బంతుల్లో 8 ఫోర్లు), జో రూట్(51: 59 బంతుల్లో 5 ఫోర్లు), ఇయాన్ మోర్గాన్(57: 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ స్టోక్స్( 89: 79 బంతుల్లో 9 ఫోర్లు)లు రాణించి జట్టు మూడొందలకు పైగా స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్ స్టో తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ జేసన్ రాయ్, జో రూట్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్‌కు 106 పరుగులు సాధించిన తర్వాత జేసన్ రాయ్ పెవిలియన్ చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో రూట్ కూడా ఔటయ్యాడు. ఆ తరుణంలో మోర్గాన్-బెన్ స్టోక్స్‌ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టే బాధ్యతను తీసుకుంది.
(ఇక్కడ చదవండి: పన్నెండో ప్రపంచ యుద్ధం)
వీరిద్దరూ మరో 106 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి గాడిలో పెట్టారు. కాగా, మోర్గాన్ నాల్గో వికెట్‌గా ఔటైన తర్వాత జోస్ బట్లర్(18), మొయిన్ అలీ(3)లు నిరాశపరచడంతో ఇంగ్లండ్ తడబడినట్లు కనిపించింది. అయితే బెన్ స్టోక్స్ సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టును మూడొందలకు చేర్చిన తర్వాత పెవిలియన్ చేరాడు. స్కోరును పెంచే క్రమంలో స్టోక్స్ 49 ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్(7 నాటౌట్), ప్లంకెట్(9 నాటౌట్)లు 11 పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.
ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాక్
ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ ఇచ్చాడు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్. తొలి ఓవర్ వేసిన తాహీర్ బౌలింగ్‌లో ఇంగ్లిష్ ఓపెనర్ బెయర్ స్టో పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. తాహీర్ వేసిన గుడ్ లెంగ్త్ బంతికి తడబడిన బెయిర్ స్టో.. సఫారీ కీపర్ డీకాక్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
రెండు ‘సెంచరీ’ భాగస్వామ్యాలు
ఇంగ్లండ్ రెండు సెంచరీకి పైగా భాగస్వామ్యాలు సాధించింది. ముందుగా జేసన్ రాయ్-జోరూట్‌ల జోడి సెంచరీ భాగస్వామ్యాన్ని సాధిస్తే, ఆపై ఇయాన్ మోర్గాన్-బెన్ స్టోక్స్‌ల జంట సెంచరీ భాగస్వామ్యాన్ని జత చేసింది. ఈ రెండు జోడీలు 106 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడం ఇక్కడ విశేషం. అదే సమయంలో ఇంగ్లండ్ జట్టులో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఇలా ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్ జట్టును సఫారీలు కట్టడి చేశారనే చెప్పాలి. ఓ దశలో ఇంగ్లండ్ 350కి పైగా పరుగులు సాధించే అవకాశం ఉందని అంతా భావించినా సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బట్లర్, మొయిన్ అలీ వికెట్లను స్వల్ప విరామాల్లో సాధించి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. దాంతో ఇంగ్లండ్ ఆఖరి ఓవర్లలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. చివరి పది ఓవర్లలో 76 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ నాలుగు వికెట్లు సమర్పించుకుంది. సఫారీ బౌలర్లలో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా,రబడా, తాహీర్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి. ఫెహ్లుకోవియా వికెట్ తీశాడు.
(ఇక్కడ చదవండి: వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తొలిసారి..)
Comments
Please login to add a commentAdd a comment