సూపర్ ‘సబ్స్’
► వేల్స్‌పై ఇంగ్లండ్ గెలుపు
► యూరో కప్
లెన్స్ (ఫ్రాన్స్): తొలి మ్యాచ్ డ్రాతో నాకౌట్ అవకాశాలను కాస్త క్లిష్టం చేసుకున్న ఇంగ్లండ్ కీలక మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయింది. వేల్స్‌తోనూ కష్టమే అనుకుంటున్న సమయంలో సబ్‌స్టిట్యూట్స్‌గా వచ్చిన ఇద్దరు ఆటగాళ్లు వార్డీ, స్టూరిడ్జ్ అద్భుతమైన గోల్స్‌తో ఇంగ్లండ్‌ను గట్టెక్కించారు. యూరో కప్‌లో భాగంగా గురువారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1తో వేల్స్‌పై నెగ్గింది. ఇంగ్లండ్ తరఫున జెమీ వార్డీ (56వ ని.), స్టూరిడ్జ్ (90+2) గోల్స్ చేయగా, గ్యారెత్ బేల్ (42వ ని.) వేల్స్‌కు ఏకైక గోల్ అందించాడు. ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 102 మ్యాచ్‌లు జరిగినా... పెద్ద టోర్నీలో ఆడటం మాత్రం ఇదే తొలిసారి.
ఆరంభంలో ఇంగ్లిష్ ఆటగాళ్లు కాస్త తడబడినా... కీలక సమయంలో మాత్రం సమష్టిగా చెలరేగారు. 42వ నిమిషంలో 25 అడుగుల దూరం నుంచి గ్యారెత్ బేల్ కొట్టిన ఫ్రీకిక్ గాల్లో గింగరాలు తిరుగుతూ ఇంగ్లండ్ గోల్ కీపర్ చేతులను తాకుతూ నెట్‌లోకి వెళ్లడంతో వేల్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ పరిణామం నుంచి తొందరగానే తేరుకున్న ఇంగ్లండ్ 14 నిమిషాల్లోనే స్కోరు సమం చేసింది. లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి స్టూరిడ్జ్ ఇచ్చిన క్రాస్ పాస్‌ను గోల్ పోస్ట్ ముందర మరో ఆటగాడు హెడ్‌తో టచ్ చేయగా... అక్కడే ఉన్న వార్డీ బంతిని నేర్పుగా డబుల్ బౌండ్ చేస్తూ నెట్‌లోకి పంపాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఇక తర్వాతి సమయం మొత్తం ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అయితే ఇంజ్యూరీ టైమ్‌లో స్టూరిడ్జ్... సూపర్ గోల్‌తో ఇంగ్లండ్ సంబపడింది.
నార్తర్న్ ఐర్లాండ్ విజయం
లియోన్: గ్రూప్-సిలో జరిగిన మ్యాచ్‌లో నార్తర్న్ ఐర్లాండ్ 2-0 తేడాతో ఉక్రెయిన్‌పై గెలిచింది. డిఫెండర్ మెక్‌ఆలే (49వ ని.), మెక్‌గిన్ (90+6) రెండు గోల్స్ చేశారు. యూరోలో ఈ జట్టుకు ఇదే తొలి విజయం.