పోర్చుగల్ తడబాటు
ఆస్ట్రియాతో మ్యాచ్ కూడా ‘డ్రా’ పెనాల్టీ కిక్‌ను వృథా చేసిన రొనాల్డో యూరో కప్
పారిస్: వచ్చిన ఒకటి, రెండు అవకాశాలనూ ఒడిసి పట్టుకోలేకపోయిన పోర్చుగల్... యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఐస్‌లాండ్‌లాంటి పసికూన జట్టుతో తొలి మ్యాచ్‌ను 1-1తో ‘డ్రా’ చేసుకున్న పోర్చుగల్... రెండో మ్యాచ్‌లోనూ విజయం రుచి చూడలేకపోయింది. ఆరంభం నుంచే ఎదురుదాడులకు దిగినా... అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో గ్రూప్ ‘ఎఫ్’లో శనివారం ఆస్ట్రియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌ను పోర్చుగల్ 0-0తో ‘డ్రా’ చేసుకుంది. రెండో అర్ధభాగంలో వచ్చిన ఓ అద్భుత అవకాశాన్ని స్టార్ స్ట్రయికర్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చేజేతులా జారవిడవడంతో పోర్చుగల్ గెలుపు బోణీ చేయలేకపోయింది.
దీంతో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి పోర్చుగల్... ప్రస్తుతం నాకౌట్ అవకాశాలను కాస్త క్లిష్టం చేసుకుంది. 79వ నిమిషంలో పెనాల్టీ ఏరియాలో మార్టిన్ హింటెర్జర్.. రొనాల్డోను మొరటుగా అడ్డుకోవడంతో పోర్చుగల్‌కు ‘పెనాల్టీ కిక్’ను ఇచ్చారు. అయితే 12 గజాల దూరం నుంచి రొనాల్డో కొట్టిన బంతి ఎడమవైపు గోల్‌పోస్ట్‌ను తాకి బయటకు వెళ్లిపోయింది. ఈ సమయంలో ఆస్ట్రియా గోల్ కీపర్ రొబెర్ట్ అల్మెరో కుడి వైపునకు డైవ్ చేయడం గమనార్హం. కెరీర్ మొత్తంలో రొనాల్డో కొట్టిన 110 పెనాల్టీల్లో కేవలం 19 మాత్రమే వృథా కావడం విశేషం. ఈ ఏడాది మాత్రం ఇదే మొదటిది. నిమిషం తర్వాత మరో అవకాశం వచ్చినా... రొనాల్డో కొట్టిన బంతి ఆఫ్‌సైడ్‌గా వెళ్లింది. ఇక తొలి అర్ధభాగంలో ఇరుజట్లు గోల్స్ కోసం హోరాహోరీగా పోటీపడ్డాయి. నాని, రొనాల్డో కలిసి ఆస్ట్రియా డిఫెన్స్‌ను ఛేదించే ప్రయత్నం చేసినా పెద్దగా సఫలం కాలేకపోయారు.
కొత్త రికార్డు...: ఈ మ్యాచ్ ద్వారా రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. పోర్చుగల్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా (128) రికార్డు సృష్టించాడు. గతంలో లూయిస్ ఫిగో (127) పేరిట ఉన్న రికార్డు ఈ సందర్భంగా బద్దలైంది. అలాగే ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ చేసినా... నాలుగు యూరో కప్ ఫైనల్స్ టోర్నీలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు సొంతమయ్యేది.
‘యూరో’లో నేడు
గ్రూప్ ‘బి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు
రష్యా ్ఠ వేల్స్
రాత్రి గం. 12.30 నుంచి
సోనీ ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఇంగ్లండ్ ్ఠ స్లొవేకియా
రాత్రి గం. 12.30 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం