భారత్-పాకిస్థాన్ సిరీస్ సమం
* రెండో మ్యాచ్‌లో పాక్ విజయం
* ఫ్రెండ్లీ ఫుట్‌బాల్
బెంగళూరు: భారత్, పాకిస్థాన్ మధ్య ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ 2-0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. పాక్ జట్టు తరఫున 39వ నిమిషంలో కెప్టెన్ కలీముల్లా, 90వ నిమిషంలో సద్దాం హుస్సేన్ గోల్స్ చేశారు. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఇంచియాన్‌లో జరిగే ఆసియా క్రీడలకు సన్నాహకంగా ఇరు జట్ల మధ్య ఈ సిరీస్‌ను నిర్వహించారు.
అవకాశాలు వృథా...
ఈ మ్యాచ్ కోసం భారత జట్టు నాలుగు మార్పులు చేసింది. ఆట ఆరంభమైన తొలి 14 నిమిషాల్లో ఇరు జట్ల కెప్టెన్లకు గోల్ చేసే అవకాశం దక్కింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి కొట్టిన కిక్‌ను పాక్ గోల్ కీపర్ అడ్డుకోగా... కలీముల్లా కొట్టిన షాట్ పోస్ట్ పైనుంచి వెళ్లిపోయింది. కొద్ది సేపటి వరకు భారత ఆటగాళ్లు ప్రయత్నించిన లాంగ్ పాస్‌లు ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్ పోస్ట్ సమీపానికి కూడా వెళ్లలేకపోయాయి. అయితే ఆ తర్వాత 37వ నిమిషంలో హోవోకిప్ కొట్టిన షాట్, 47వ నిమిషంలో, 71వ నిమిషంలో ఛెత్రి, 87వ నిమిషంలో లౌరెన్సో గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ప్రత్యర్థి ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకోగలిగారు. దాంతో చివరికంటా పాక్ ఆధిక్యం నిలబెట్టుకోగలిగింది. ఆట ఆఖరి నిమిషంలోనూ తమకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకున్న సద్దాం మరో గోల్‌తో పాక్ విజయాన్ని ఖాయం చేశాడు.