యావత్ క్రికెట్ ప్రపంచం టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి నామస్మరణతో మునిగితేలుతుండటంతో ఎంఎస్ ధోని ప్రాశస్త్యం రోజురోజుకి తగ్గిపోతుందని అతడి ఫ్యాన్స్ నిరాశకు గురువుతున్నారు. అయితే అతడు సాధించిన విజయాలు, ఘనతలను వెలికి తీస్తూ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలను మాజీ క్రికెటర్లు, పలు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఈ దశాబ్దపు ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా ధోనిని ఎంపిక చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా ఆసక్తికర నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై జార్ఖండ్ డైనమెట్ ఫ్యాన్స్ అమితానందం వ్యక్తం చేశారు. తాజాగా వారికి మరింత జోరు కలిగించే వార్త ప్రముఖ క్రీడా ప్రసార సంస్థ ఈఎస్‌పీఎన్ తెలిపింది.
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో ప్రకటించిన ఈ దశాబ్దపు వన్డే, టీ20 జట్లకు సారథిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేసింది. అయితే టెస్టు జట్టుకు సారథిగా విరాట్ కోహ్లి వైపే మొగ్గు చూపింది. 23 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ పలు అంశాలను పరిగణలోకి తీసుకుని టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ దశాబ్దంలో ఆరేళ్లకు పైగా ఆడి ఉండి లేక కనీసం 50 టెస్టులైనా ఆడిన ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని టెస్టు జట్టును ప్రకటించినట్టు ఈఎస్‌పీఎన్ తెలిపింది. అదేవిధంగా కనీసం 75 వన్డేలు, 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల రికార్డులను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు వివరించింది.
ఇక టెస్టు జట్టులో కోహ్లితో పాటు టీమిండియాకు చెందిన మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఇక వీరితో పాటు ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌లు టెస్టు జట్టులో ఉన్నారు. వన్డేల్లో ధోని, కోహ్లిలతో పాటు రోహిత్ శర్మకు అవకాశం దక్కింది. టీ20 ఫార్మట్ విషయానికొస్తే వెస్టిండీస్ ఆటగాళ్ల ఆధిపత్యమే కొనసాగుతోంది.
ఏకంగా ఐదుగురు కరీబియన్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, సునీల్ నరైన్, పొలార్డ్‌లతో పాటు ఆండ్రీ రసెల్‌లు టీ20 జట్టులో ఉన్నారు. ఇక టీమిండియా నుంచి ధోనితో పాటు కోహ్లి, జస్ప్రిత్ బుమ్రాలు అవకాశం దక్కించుకున్నారు. మహిళల క్రికెట్ విషయానికి వస్తే మిథాలీ రాజ్, జులాన్ గోస్వామిలు ఇద్దరు వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకోగా.. ఈ రెండు ఫార్మట్లకు ఆసీస్ క్రికెటర్ మెగ్ లాన్నింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment