
భళా... బొలివియా
ఈక్వెడార్‌పై సంచలన విజయం
► చిలీ, మెక్సికో మ్యాచ్ ‘డ్రా’
► కోపా అమెరికా కప్
శాంటియాగో (చిలీ) : కలసికట్టుగా, కసితీరా ఆడితే పటిష్ట జట్టును బోల్తా కొట్టించవచ్చని బొలివియా జట్టు నిరూపించింది. కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బొలివియా జట్టు తమకంటే 58 స్థానాలు మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఈక్వెడార్‌పై సంచలన విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 89వ ర్యాంకర్ బొలివియా 3-2 గోల్స్ తేడాతో ప్రపంచ 31వ ర్యాంకర్ ఈక్వెడార్‌ను ఓడించింది.
ఈ క్రమంలో బొలివియా 20 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో విజయాన్ని రుచి చూసింది. అంతేకాకుండా 1997 తర్వాత బొలివియా కోపా అమెరికా కప్‌లో ఓ మ్యాచ్‌లో గెలిచింది. ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలోనే బొలివియా తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. 5వ నిమిషంలో రాల్డెస్, 18వ నిమిషంలో స్మెడ్‌బెర్గ్ డాలెన్స్, 43వ నిమిషంలో మొరెనో ఒక్కో గోల్ చేసి బొలివియాకు 3-0 ఆధిక్యాన్ని అందించారు. రెండో అర్ధభాగంలో ఈక్వెడార్ తేరుకున్నా ఫలితం లేకపోయింది.
48వ నిమిషంలో వాలెన్సియా... 81వ నిమిషంలో బొలానోస్ ఈక్వెడార్‌కు ఒక్కో గోల్ అందించినా అప్పటికే ఆలస్యమైపోయింది. మరోవైపు ఇదే గ్రూప్‌లో చిలీ, మెక్సికో జట్ల మధ్య మ్యాచ్ 3-3 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. చిలీ తరఫున విడాల్ (22వ, 55ని.లో), వర్గాస్ (42వ ని.లో) గోల్స్ చేశారు. మెక్సికో జట్టుకు వుసో (21వ, 66వ ని.లో), జిమెనిజ్ (29వ ని.లో) గోల్స్ అందించారు. రెండేసి మ్యాచ్‌లు పూర్తయ్యాక గ్రూప్ ‘ఎ’లో చిలీ, బొలివియా జట్లు నాలుగేసి పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాయి.