బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): వినోదాన్ని పంచాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానం హద్దులు దాటడంతో విషాదాన్ని మిగిల్చింది. అర్జెంటీనాలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఇరు జట్ల అభిమానులు ఘర్షణ పడటంతో ఓ అభిమాని తీవ్రంగా గాయపడి మరణించాడు.
బెల్‌గ్రానో, టాలెరెస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. స్టేడియంలో మ్యాచ్ తిలకిస్తున్న ఇరు జట్ల అభిమానులు పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో ఎమాన్యుల్ బాల్బో అనే అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా, కోమాలో ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆ తర్వాత అతన్ని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఎమాన్యుల్ మృతిపై ఫుట్‌బాల్ సంఘాల అధికారులు దిగ్భ్రాంతి చెందారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనను జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, అభిమానులు ఇలా దాడులకు దిగడం సరికాదని పేర్కొన్నారు.